
2023 ఎన్నికలకు అధికార భారాస తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కులాలు లేవని చెప్పే ప్రాంతంతో ఆధిపత్య వర్గాల లెక్కలు వేసి మరీ ఇచ్చారు. ప్రకటించిన 115 సీట్లలో 40 మంది రెడ్డి వర్గం నేతలైతే, 12 మంది వెలమ వర్గం నేతలు. మెుత్తం 119 సీట్లలో ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో ఈ రెండు కులాలకు దాదాపు 44% కేటాయించింది అధికార పార్టీ. ఇదికాక జనగామ, నర్సాపూర్ సిటింగ్ యంయల్ఏలు అధికార పార్టీ నుండి గెలిచిన రెడ్డి వర్గం యంయల్ఏలు. అక్కడ పోటీ కూడా ఆవర్గం నాయకుల మద్యే ఉంది కనుక అవికూడా వారికే అనుకోవచ్చు. అదే సమయంలో మల్కాజిగిరి యంయల్ఏ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం మార్చవచ్చు అనే వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం మారిస్తే అక్కడ కూడా రెడ్డి అభ్యర్థికి ఇస్తారు. ఇవి మూడు కూడా ఇస్తే కేవలం రెడ్డి వర్గానికి అధికార పార్టీ తరపున 43 సీట్లు కేటాయించినట్టు, ఇది మెుత్తం అసెంబ్లీ సీట్లలో 43%. ఇదే మెుదటిసారి కాదు, తెలంగాణ ఏర్పడిన మెుదటి అసెంబ్లీ నుండి రెడ్డి వర్గం యంయల్ఏలు 40 మందికి తగ్గకుండా ఉంటే వెలమలు 10 మంది వరకు ఉంటున్నారు. అసెంబ్లీలో 40% పైన ఉన్న ఈ రెండు వర్గాల నిష్పత్తి జనాభాలో చూస్తే రెడ్డి వర్గం 6.5-7% ఉంటే వెలమలు 2.5-3% ఉంటారు. అంటే రాష్ట్రంలో వీరి జనాభా 10% లోపే.
ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ప్రాంతంలోనే బిసిల జనాభా ఎక్కువ, బిసిలు 60-65% వరకు ఉంటారని అంచనా. కేవలం యాదవ, ముదిరాజు, గౌడ వర్గాలే తెలంగాణ జనాభాలో 30% వరకు ఉంటారని అంచనా. కానీ అధికార పార్టీ ప్రకటించిన సీట్లలో మెుత్తంగా బిసిలకు కేటాయించిన సీట్లు 20% లోపే. ఇక రెడ్డి వర్గం పూర్తి ఆధిపత్యం వహించే కాంగ్రేసులో భారాస కంటే ఒకటి రెండైనా ఎక్కువే ఆ వర్గానికి దక్కుతాయని ఊహించవచ్చు. బిజేపిలో కూడా ప్రస్తుతం ఆ వర్గ నాయకులదే ఆధిపత్యం కనుక దానిలో కూడా 30 కి తగ్గకుండా వారికి కేటాయించే అవకాశాలున్నాయి.
చట్టసభలలో ప్రాతినిధ్యం చూస్తే తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతంలోనే బిసి ప్రాతినిధ్యం ఎక్కువ. ఇంకా ఆశ్చర్యంగా ఏ కోస్తా ప్రాంతాన్నైతే కులాల గొడవలుగా చూపిస్తారో అక్కడే బిసిల ప్రాతినిధ్యం రాయలసీమ, తెలంగాణ కంటే అధికం. ఇదే విధంగా కోస్తా ప్రాంతంలో అగ్రవర్ణాలకు అధిక సీట్లు ప్రకటించి ఉంటే బిసి వర్గాలు పోరాడి మరీ సాధించుకునేవి. కానీ విచిత్రంగా తెలంగాణలో ఎవరూ దీని గురించి మాట్లాడరు. మరి ఆంధ్రలో ఉన్నది తెలంగాణలో లేనిది కులాలా లేక కుల చైతన్యమా? నిజాం పాలన నుండి యన్టీఆర్ పటేల్, పట్వారీ రద్దు చేసే వరకు తెలంగాణ ప్రాంతంలో గడీల పేరిట అగ్రవర్ణ ఫ్యూడల్ పద్దతులే నడిచాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికీ దొరల పాలన అని ఒక కులాన్ని సూచిస్తూ, పటేళ్ళ పెత్తనం అని మరొక కులాన్ని సూచిస్తూ రాజకీయ ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుడు వెల్కం పాలన అని రెండు కులాలను సూచిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడటం చూసాం. వీటికి పరాకాష్టగా ఆంధ్రలో కూడా మాట్లాడని విధంగా ఒక నాయకుడు బహిరంగ సభలో మనది పాలించే కులం, మనం లేకపోవడం వల్లే కాకతీయుల నిండి అన్ని రాజ్యాలు కూలిపోయాయని చెప్పడం చూసాం. ఇలా అడుగడుగునా కులం శ్వాసిస్తూ కులాలు లేవని చెప్పుకుని మభ్యపెట్టుకోవడం ఏమిటో అర్దం కాని విషయం. ఇలా అన్ని కులాలకు చెందవలసిన వాటిని ఒకటి రెండు కులాలే పంచుకోవడాన్ని కులాలు లేని సమాజం అంటారేమెూ ఆ మేధావులే చెప్పాలి.
శ్రీకాంత్.సి
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…