
ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను శాశించిన బీఆర్ఎస్ పార్టీ నేటికీ 2వ స్థానంలో నిలిచి రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు నిరూపించుకుంటూనే ఉంది. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు అనేక సవాళ్ళున్నాయి.
1. అధికార కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం.
2. రెండున్నరేళ్ళుగా కేసీఆర్ ఫామ్‌హౌసుకే పరిమితం కావడంతో ఆయన పని, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపణ తప్పని నిరూపించాల్సి ఉంది.
3. ఇంతకాలం కల్వకుంట్ల కవితకి పార్టీ లేదు కనుక ఆమె చేసే విమర్శలకు బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పలేదు. కానీ ఆమె ఈ నెల 25న తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. కనుక ఇకపై ఆమె చేసే విమర్శలకు తప్పనిసరిగా బదులివ్వాల్సి ఉంటుంది.
4. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆమె ఆకర్షించే ప్రయత్నం తప్పక చేస్తారు. కనుక ఎవరూ చేజారిపోకుండా కాపాడు కోవాలి. ఇటువంటి సవాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి.
కనుకనే కూతురు పార్టీ ప్రకటించక మునుపే ఈ నెల 20న జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభకి కేసీఆర్ హాజరవుతున్నారు. ఆ సభలో ముఖ్యంగా కూతురు కవిత రాజకీయాలు, కేంద్రం పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి గురించి కేసీఆర్ మాట్లాడుతారని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలపై ఇప్పటికే పార్టీ వైఖరిని కేటీఆర్ తెలియజెప్పారు. కనుక కేసీఆర్ కొత్తగా ఏమైనా చెప్తారో లేదో జగిత్యాల సభలో తెలుస్తుంది.
ఈ సభకు కేసీఆర్ హాజరవబోతున్నారు కనుక భారీగా జనసమీకరణ చేసి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టుదలగా పనిచేస్తున్నారు.
కానీ ఇంత హడావుడి చేసిన తర్వాత గత ఏడాది ప్లీనరీ సభని కేసీఆర్ ‘తుస్’మనిపించినట్లే, ఈ సభని కూడా ‘తుస్’మనిపిస్తే, పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేసి నమ్మకం కలిగించలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయి.
కనుక ఈ సభతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు కొత్తగా ఏమైనా చేస్తారా లేదా పార్టీ పతనానికి దారి చూపిస్తారా? అనేది సోమవారం తేలిపోతుంది.
Ever since the most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar, was…
AP Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan held a key…