
KCR and Jagan's Political Strategy
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే ముందు విజిల్ వేసుకుంటూ ‘యు ఆర్ అండ్ అరెస్ట్’ అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి తెలిసే ఉంటుంది.
నేటి కాలం రాజకీయాలను గమనిస్తే ఇక్కడ కూడా సేమ్ సీన్ రీపీట్ అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే అక్కడ రెండున్నర గంటలు సాగే కథ స్థానంలో ఇక్కడ ఐదేళ్ల రాజకీయ యుద్ధం చేరుతుంది. అక్కడ హీరో – విలన్ పాత్రలు కాస్త ఇక్కడ అధికార – విపక్ష పాత్రలుగా మారుతున్నాయి.
అలాగే సినిమాలో పాటల స్థానంలో ఇక్కడ ప్రభుత్వ అభివృద్ధి పనులు కనిపిస్తే, ఫైట్ల స్థానంలో ప్రతిపక్షాల పోరాటాలు దర్శనమిస్తాయి. ఇలా అక్కడ వెండితెర మీద కనిపించే ప్రతి ఒక్క దృశ్యం ఇక్కడ రాజకీయ తెర మీద దర్శనమిస్తుంది. అయితే అసలు విషయానికొస్తే, ఆ వెండితెర మీద కనిపించే చిత్రంలో క్లైమాక్స్ లో వచ్చే పోలీసుల పాత్రను మాత్రం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధినేత పోషించడం కొసమెరుపు.
రెండున్నర గంటల సినిమా కథలో హీరో, విలన్ మధ్య ఎన్ని రక్తపాతాలు జరిగినా, ఎంత ప్రాణ నష్టం వాటిల్లినా పోలీసుల ఎంట్రీ మాత్రం సినిమా క్లైమాక్స్ వరకు వేచి ఉండాల్సిందే. సరిగ్గా ఇక్కడ కూడా అలానే అధికార, విపక్ష పార్టీల మధ్య ఎన్ని రాజకీయ యుద్దాలు జరిగినా, పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు ఎన్ని ఇబ్బందులకు గురైనా విపక్ష పార్టీ అధినేత ఎంట్రీ మాత్రం ఎన్నికలకు ఏడాది ముందే అన్నట్టుగా మారిపోయింది.
పార్టీ ఓటమి తరువాత ప్రతిపక్ష పార్టీ అధినేత ఇటు ప్రజలకు అటు పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదు అనే విమర్శలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కునే పరిస్థితులు వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానే అయి ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఏకచక్రాధిపత్యం చేస్తున్న ఈ నేతలు ఒక్కసారి పార్టీ ఓటమి చవిచూడగానే పార్టీ పూర్తి బాధ్యతలను పార్టీ కింద స్థాయి నాయకుల మీద, పార్టీ కార్యకర్తల భుజాన వేస్తూ పక్కకు తప్పుకుంటున్నారు అనే విమర్శలను ఎదుర్కుంటున్నారు .
ఉదాహరణకు ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ విధానాలు గమనించినా, అటు తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతుంది. ఏపీలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలుపు బాధ్యతను పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నేతల మీదే జగన్ నెట్టేసిన వైనం ఇటువంటి విమర్శలకు బలం చేకూరుస్తుంది.
అధికార పార్టీ పై తన తరుపున, పార్టీ తరుపున వారిని రాజకీయ యుద్ధం చెయ్యమని, లేకుంటే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ల పై ఆశలు వదులుకోవాలని హెచ్చరికలు జారీచేసి స్థాయికి పరిస్థితులు వెళ్లిపోతున్నాయి. వచ్చే ఏడాది పాదయాత్ర తో ప్రజల ముందుకొస్తానని అప్పటి వరకు పార్టీ పూర్తి బాధ్యత క్యాడర్, లీడర్ల దే అంటూ తేల్చి చెప్పేసారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
అలాగే ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తరువాత వచ్చిన ఉపఎన్నికల బాధ్యత నుంచి ఆ పార్టీ రాజకీయ విధివిధానాల వరకు పార్టీ పూర్తి బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజాన వేసి కేసీఆర్ గత 1000 రోజులుగా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అంటూ అధికార కాంగ్రెస్ పోస్టర్లను సైతం సిద్ధం చేసింది.
ఇలా ఈ ఇద్దరు అధినేతలు అటు చట్టసభలకు వెళ్లకుండా, ఇటు క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు చేయకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల ముందు ప్రజల మధ్యకు వచ్చి ఈ ప్రతిపక్ష పాత్ర కు శుభం కార్డు వేస్తామంటూ భీష్మించుకుని కూర్చున్నారు.
మరి ఐదేళ్ల రాజకీయ యుద్దాన్ని ముగించేందుకు ‘సిద్ధమా’ అంటూ పాదయాత్ర తో వైఎస్ జగన్, ‘జై తెలంగాణ’ అంటూ గులాబీ కారులో కేసీఆర్ ఇద్దరు కూడా క్లైమాక్స్ లి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…