
దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగారు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఓ నిర్ణయమే అనేవారు. కేసీఆర్ దానిని అక్షరాల పాటిస్తున్నట్లున్నారు.
కూతురు కల్వకుంట్ల కవిత తిరుగుబాటు జెండా ఎగురు వేశారు. గులాబీ కండువా పక్కన పడేసి జాగృతి కండువాలు వేసుకొని హడావుడి చేస్తున్నారు.
పార్టీలో నా పాత్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నా లేఖని ఎవరు లీక్ చేశారో, ఎందుకు చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. సొంత కూతురికి వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు జరుగుతుంటే లీకు వీరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించనని తెగేసి చెప్పారు. బీజేపితో విలీనం కావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం బయటపెట్టారు.
ఒకవేళ ఆమె స్థానంలో మరొకరు ఎవరైనా ఈవిదంగా మాట్లాడి ఉండి ఉంటే వెంటనే మెడ పట్టుకొని బయటకు గెంటేసి ఉండేవారు. కానీ కూతురు కనుక కేసీఆర్ ఉపేక్షిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కూతురు ఇంత హడావుడి చేస్తున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?బిఆర్ఎస్ పార్టీలో ఇంత పెద్ద సమస్య వచ్చినా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు?
కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కి కమీషన్ నోటీస్ ఇవ్వడాన్ని తప్పు పడుతూ కూతురు కవిత ఇందిరా పార్కులో ధర్నా చేస్తే, కేసీఆర్ వారించలేదు లేదా ఆమెకు సంఘీభావం తెలపాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎందుకు ఆదేశించలేదు?
తనకు కమీషన్ నోటీస్ ఇవ్వడాన్ని కూతురు తప్పు పడుతుంటే, ఈ నెల 11న విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ ఎందుకు అనుకొంటున్నారు? అసలు కూతురు విషయంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అనే ప్రశ్నలన్నీటికీ మౌనమే సమాధానం.
ముందే చెప్పుకున్నట్లు, కేసీఆర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా మౌనంగా ఉండిపోవడం ద్వారా కూతురు కవితకి చెప్పాల్సింది చెప్పేసినట్లే!
కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ని రాజకీయ వారసుడిగా భావిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అయ్యి తన కుర్చీలో కొడుకుని కూర్చోబెట్టాలనుకున్నారు. కేసీఆర్ దేశ్ కీ నేత, ప్రధాన మంత్రి, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అని పార్టీ నేతల చేత చెప్పించుకున్నారు కూడా. ఇప్పుడా పరిస్థితి లేనప్పటికీ తనని, తన రాజకీయ వారసుడిని ప్రశ్నిస్తున్న కూతురుని కేసీఆర్ క్షమిస్తారనుకోలేము.
కొడుకు, కూతురులో ఎవరు మిన్న అంటే అందరూ తండ్రుల్లాగే కేసీఆర్ కూడా కొడుకువైపే మొగ్గు చూపారు. సరిగ్గా ఇందుకే కల్వకుంట్ల కవిత తండ్రిపై తిరుగుబాటు చేశారు కూడా.
కనుక తండ్రి తనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే జనం సానుభూతి పొందవచ్చని కల్వకుంట్ల కవిత ఎదురు చూస్తుంటే, ఆమె విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఊరుకుంటే ఆమె సహనం కోల్పోయి బయటకు వెళ్ళిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో?
ఇది కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న అంతర్యుద్ధం కనుక పార్టీ నేతలెవరూ దీనిలో వేలు పెట్టే సాహసం చేయడం లేదు.
ఈ నెల 10న కేటీఆర్ అమెరికా నుంచి తిరిగివస్తారు. అప్పుడు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్స్‌కి ముగింపు వస్తుందేమో?
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…