ఆ ‘రక్త కన్నీరు’కు భాద్యులెవ్వరు.?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిందని గర్వపడలా లేక 78 సంవత్సరాలు పూర్తయిన ఇంకా సమాజంలో మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నాం అని సిగ్గుపడాలో తెలియని దయనీయ పరిస్థితులలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా అన్న సందేహాలు నానాటికి బలపడుతున్నాయి.

ADVERTISEMENT

నాటి ఉమ్మడి ఏపీలో జరిగిన శ్రీ లక్ష్మి మొదలు ఆయిషా మీరా, సుగాలి ప్రీతి వరకు ఏ కేసులోనూ బాధితులకు సరైన న్యాయం అందలేదు. అలాగే నిన్న మొన్న ఏపీలో జరిగిన పసికందుల మీద అరాచకాలకు సమాధానం దొరకలేదు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచం ముందు భారత సమాజాన్ని దోషిగా చూసిన విషయం మరువక ముందు, హైద్రాబాద్ లో దిశా ఉదాంతం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది.

అలాగే నాటి కోల్కత్త ట్రైనీ డాక్టర్ సంఘటన మరోసారి దేశంలో మహిళ భద్రతపై సమాజం ముందు మరికొన్ని ప్రశ్నలను మిగిల్చింది. నానాటికి సమాజంలో మానవత్వం నశిస్తుందా? ఒక మనిషి నిండు ప్రాణానికి విలువ లేకుండా పోతుందా? ఒక స్త్రీ పట్ల ఇంత పైశాచిక దాడులా? ప్రభుత్వ వ్యవస్థలు గాడి తప్పుతున్నాయా? లేక చట్టాలు చుట్టం చూపుగా న్యాయం చేస్తున్నాయా?

9 మాసాలు మోసి ఎన్నో బాధలను భరించి ఒక ప్రాణానికి ఊపిరి పొసే మహిళల ప్రాణాలు ఒక కామాందుడి క్షణ కాలం సుఖానికి బలవ్వాల్సిందేనా? మహిళల తల రాత మారేదెప్పుడు? ఆ అభాగ్యుల ఆక్రందనలకు, వారి కుటుంబాల ఆక్రోశానికి మూల్యం చెల్లించేదెవరు? నేరం చేసిన వాడు యథేచ్ఛగా సమాజంలో తిరగగలుగుతున్నాడు.

కానీ బాధితులు, వారి కుటుంబాలు మాత్రం మౌనంగా ‘రక్త కన్నీరు’ కారుస్తూ సభ్య సమాజానికి దూరంగా జీవిస్తున్నారు. బాధితులు చిందిస్తున్నరక్తానికి ఆ కుటుంబాలు కారుస్తున్న కన్నీటికి న్యాయం జరుగుతుందా? న్యాయం చేసే పరిస్థితులలో దేశంలో వ్యవస్థలు పని చేస్తున్నాయా? ఇంత పాశవికంగా, పైశాచికంగా ఒక ఆడబిడ్డ మీద హత్యాచారం, హత్య చేసిన వ్యక్తుల పట్ల కూడా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయంటూ వార్తలు రావడం కలవరం పుట్టిస్తున్నాయి.

ఎక్కడో మారుమూల జరిగిన ఘోరం కాదు, నిర్మానుష్య ప్రాంతము కాదు, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో తోటి డాక్టర్లు, వందల సంఖ్యలో పేషంట్లు, ఉద్యోగులు ఉన్న ప్రదేశంలో ఎటువంటి బెరుకు భయం లేకుండా ఇంతటి దారునానికి ఒడికట్టాడు అంటేనే భారతీయ న్యాయవ్యవస్థల మీద, చట్టాల మీద నిందితులకు ఎంత చిన్న చూపు అనేది స్పష్టమయింది.

తప్పు చేసి తప్పించుకోవడం, దారుణాలు చేసి దాక్కోవడం, చట్టాలలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని బయటకు రావడం, ఇటువంటి కామాంధులకు హత్యాచారం చేసినంత సులువైపోయింది. వాడి ఆనందానికి, క్షణకాలం సుఖానికి ఒక ఆడపిల్ల నిండు జీవితాన్ని బలికోరుకుంటున్నాడు . అటువంటి వారి ధైర్యానికి ఇటువంటి వారి దయనీయ పరిస్థితికి బాధ్యులెవరు.?

ప్రభుత్వాల నుండి రాజకీయ పార్టీల వరకు, సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు తమవంతు బాధ్యతగా సమాజం నుండి ఇటువంటి చెడుని తరిమికొట్టాలి. ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న నిందితులలో పెరుగుతున్న క్రూరత్వానికి ఇంకెంతమంది నిర్భయలు బలికావాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణాలకు కూడా రాజకీయ రంగు పులవడం అత్యంత హీనమైన చర్య అవుతుంది.

తన బిడ్డ మీద జరిగిన ఘోరానికి తగిన న్యాయం కావాలి, దోషులకు శిక్షపడాలి అంటూ తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కిన, దేశంలో ఇటువంటి దారుణం మరొకటి జరగకూడదు అంటూ బాధితులకు అండగా సమాజం రోడ్డెక్కినా, దాని పరిణామం రెండు రోజులు మీడియాలో హెడ్ లైన్స్ లో ఉండడం, నాలుగు రోజులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తప్ప మరొక ప్రయోజనం లేకుండా పోతుంది.

తప్పు జరిగితే ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు, చట్టం ముందు తప్పించుకోలేడు, అంటూ తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి దారుణాలకు అడ్డుకట్ట వెయ్యలేము. ప్రతిఒక్కరు ఇది తమ బాధ్యత అనేలా ఇంటిలో తల్లిదండ్రుల నుండి పాఠశాలలో ఉపాధ్యాయుల వరకు అందరూ మహిళల పట్ల పురుషుడు నడుచుకోవాల్సిన విధానాలను వివరించాలి.

అలాగే నేటి సోషల్ మీడియాలో వస్తున్న డీగ్రేడ్ కంటెంట్ల పట్ల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలి. అలాగే సమాజాన్ని ప్రభావితం చేసే వాటిలో ముఖ్య భూమిక పోషిస్తాయి సినిమాలు. అటువంటి సినిమాలలో అస్లీలత హద్దులు దాటిపోతుంది. ఓటిటి లో వచ్చే వెబ్ సిరీస్లు అస్లీలతను ఇంటి లోపలికి తీసుకువచ్చేసింది.

దర్శక నిర్మాతలు, నటీనటులు కూడా ఇటువంటి కంటెంట్ల మీద ఒక్కసారి పునరాలోచించుకుని మహిళ భద్రత వారి సామజిక బాధ్యతగా భావించి అడుగు ముందడుకు వెయ్యాలి. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కూడా మరో మహిళకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే ఇక ఒక ఆడబిడ్డ కు రక్షణ ఎక్కడ.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

1 hour ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

2 hours ago