
నెల్లూరులోని ఉమ్మారెడ్డి గుంట (గ్రామీణ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు 21వ డివిజన్‌లో మురికి కాలువలో దిగి ధర్నా చేశారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలో మురికి కాలువలు ఎప్పుడూ పొంగిపొర్లుతుంటాయి. ఎగువ ప్రాంతంలో ఏ మాత్రం నీళ్ళు పెరిగినా అవన్నీ ఈ మురికి కాలువల ద్వారా పొంగి ప్రవహిస్తూ ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. గత 10-15 ఏళ్ళుగా ఇక్కడి ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇదివరకు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగాను. కానీ వారు పట్టించుకోకపోవడంతో అప్పుడు ఈ మురికి కాలువలోనే దిగి నిరసనలు తెలిపాను.
ఇప్పుడు మా పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను కనుక ఈ సమస్యను పరిష్కరించగలననే అనుకొన్నాను. కానీ గత మూడేళ్ళుగా కార్పొరేషన్, రైల్వే అధికారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపాను. వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించి చెప్పాను. కానీ వాళ్ళు ఈ కాలువను, దానిపై వంతెనను మేము కట్టాలా… మీరు కట్టాలా…? అని వాదించుకొంటూనే మూడేళ్ళు గడిపేశారు తప్ప ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.
ఇవాళ్ళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు నన్ను మళ్ళీ నిలదీశారు. అప్పుడు చేయలేకపోయావు సరే..ఇప్పుడుమీ ప్రభుత్వమే అధికారంలో ఉంది పైగా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి కూడా మరి కాలువ పనులు ఎందుకు చేయించలేకపోతున్నావు?అంటూ నిలదీశారు.
నిజమే! మా పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇంత చిన్న పని చేయించలేకపోయినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్పుకొంటున్నాను. ఈ సమస్య ఇక చర్చలతో పరిష్కారం కాదని గ్రహించాను. అందుకే ఇప్పుడే మళ్ళీ ఈ మురికి కాలువలో దిగి ధర్నా మొదలుపెడుతున్నాను…” అంటూ పక్కనే ఉన్న మురికి కాలువలో దిగిపోయారు.
ఈ విషయం తెలుసుకొని నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్, రైల్వే అధికారులు అక్కడికి వచ్చి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ కాలువ పనులు తక్షణం మొదలుపెడితే తప్ప బయటకు రానని మొండికేశారు. అప్పుడు అధికారులు ఆయనను చాలా సేపు బ్రతిమాలుకొన్న తరువాత, ఈ కాలువ పనులు ఎప్పుడు మొదలుపెట్టి ఎపుడు పూర్తిచేస్తారో లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ అధికారులందరూ సంతకం చేసి ఇస్తేనే బయటకు వస్తానని పట్టుబట్టారు.
చివరికి వారు అంగీకరించి ఈనెల 15వ తేదీన పనులు ప్రారంభించి ఆగస్ట్ 15వ తేదీలోగా పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తరువాత వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాలువలో నుంచి బయటకు వచ్చారు.
ఇంత చిన్న సమస్యను పరిష్కరించడానికి మూడేళ్ళుగా ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి మురికి కాలువలో దిగి ధర్నా చేస్తే పనులు మొదలవుతున్నాయి. ఇదీ వైసీపీ ప్రభుత్వం పనితీరు.. ఆ పార్టీ ఎమ్మెల్యేల తిప్పలూ.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…