
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎఫ్-1 రేసింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ఓ లొట్టిపిట్ట కేసంటూ చాలా తేలికగా కొట్టిపడేస్తుంటారు. అవునో కాదో తెలియాలంటే కేసు విచారణ ముందుకు సాగాలి.
కానీ ఈ కేసులో అయనకి నోటీస్ ఇచ్చి విచారించేందుకు తెలంగాణ గవర్నర్ అనుమతించి నాలుగు నెలలైనా ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎఫ్-1 రేసింగ్ కేసులో తెలంగాణ ఏసీబీ సోమవారం నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలో కేటీఆర్ ప్రధాన నిందితుడు (ఏ-1) గా పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురి పేర్లు ఛార్జ్ షీట్‌లో చేర్చింది.
ఎఫ్-1 రేసింగ్ పేరుతో ఈ వ్యవహారంలో రూ.55 కోట్లు నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థలకు పంపించారని, ఇందుకు ప్రతిగా ఏస్ నెక్స్ట్ జనరేషన్ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.45 కోట్లు వచ్చాయని పేర్కొంది.
ఈ క్విడ్ ప్రోలో లావాదేవీల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఆర్ధిక లబ్ది కలిగించినందుకు, నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్లు విదేశీ సంస్థలకు పంపించినందుకు వీరిపై ఈ నేరారోపణ చేస్తున్నట్లు తెలంగాణ ఏసీబీ పేర్కొంది.
ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ వరకు వచ్చింది. దానిలో కేటీఆర్ పేరుంది. కనుక త్వరలోనే ఆయనకు ఏసీబీ నోటీసు జారీ చేసి విచారణకు పిలిపించవచ్చు.
ఈ కేసులో తనని అరెస్ట్ చేసుకోవచ్చునని కేటీఆర్ ఇదివరకే సవాలు విసిరారు. రెండు మూడు నెలలో జైల్లో యోగా వగైరా చేసుకొని ‘ఫిట్’గా తయారై బయటకు వస్తానని జోక్ చేశారు. కానీ ఇప్పుడు కూడా అయన ధైర్యంగా ఆ మాట అనగలరా?అంటే కాదనే చెప్పాలి.
పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రావడం లేదు. లోపల కూర్చొని అయన చేసే మంత్రాంగం కూడా పనిచేయడం లేదు.
మరోపక్క కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతోంది. అది రెడీ అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచే వలసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళితే ముందే వలసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
కేసీఆర్, కేటీఆర్ అందుబాటులో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్‌గా హరీష్ రావు చేతికి వెళ్తుంది. అంటే పార్టీ నాయకత్వం మారినట్లే అవుతుంది.
ఇదివరకు అంటే కేసీఆర్, కవిత అందుబాటులో ఉన్నప్పుడు ఈ కేసులో కేటీఆర్ జైలుకి వెళితే, వారు పార్టీకి సానుభూతి ఓట్లు సంపాదించగలిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
కనుక ఈ లొట్టిపిట్ట కేసులో జైలుకి వెళ్ళకుండా ఉండేందుకు కేటీఆర్ గట్టిగా న్యాయపోరాటం చేయక తప్పదు.
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…