
కేసీఆర్ తెలంగాణ సాధించారు. అభివృద్ధి చేశారు. గొప్ప వక్త అని అందరికీ తెలుసు. కానీ ఆయన చేసిన మరో గొప్ప పనేమిటంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ తన మాటకారితనం కూడా నేర్పించారు. ఒకప్పుడు బీఆర్ఎస్ నేతలు నోట్లో వేలు పెడితే కొరకడం చాతకాదన్నట్లు ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అందరూ వింటూనే ఉన్నారు.
పార్టీలో నేతలకే మాటలు నేర్పిన కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు, కూతురు కవితకు నేర్పకుండా ఉంటారా? అదీగాక ఆయన పిల్లలకు సహజంగానే ఆయన మాటకారితనం రాకుండా ఉంటుందా? ఇదిగో మరో చిన్న శాంపుల్…
ముందుగా చిన్న ఫ్లాష్‌బ్యాక్: నాలుగు రోజుల క్రితం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ఉద్దేశించి ‘తోలు తీస్తా’ అంటూ అనుచితంగా మాట్లాడారు. అందుకు వారు కూడా చాలా ఘాటుగా బదులిచ్చారు.
తాను తండ్రి పేరు చెప్పుకొని ఈ స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ, “అవును మా నాన్న తెలంగాణ సాధించిన మొనగాడు. తెలంగాణను అభివృద్ధి చేసిన మొనగాడు. అలాంటి మొనగాడి కొడుకునైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా తండ్రి గొప్పోడని, నేను ఆయన కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గెందుకు?
ఆయన పోరాటాలు, విజయాలు, పదవులు అన్నిటినీ పక్కన పెడితే ఆయన నా తండ్రి. కనుక ఆయనని ఎవరైనా ఏమైనా అంటే కొడుకుగా నాకు కోపం రాదా? నా తండ్రి గురించి ఆ విధంగా మాట్లాడినందుకు నాకు రేవంత్ రెడ్డిపై పీకల దాకా కోపం ఉంది. దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకొని కొట్టాలని కూడా ఉంది.
కానీ మనది ప్రజాస్వామ్యం కదా? నేను గట్టిగా ఏమైనా అంటే వీడికి అహంకారం అంటారు మళ్లీ! అయినా నేనేమి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి కాలేదు. నేనేమి ఎవరి కోసమూ మూటలు మోయలేదు. నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకుంటే తప్పు కాదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గురించి ఓ రెండు ముక్కలు చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఆమె కూడా తండ్రి కేసీఆర్ పేరుతోనే ఇంతకాలం రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు ఆమె తండ్రి పేరు, ఫోటో తీసి పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. కేటీఆర్ దాదాపు 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మొదట్లో ఉద్యమాల్లో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత మంత్రిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. కనుక ఇంకా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ నేటికీ తండ్రి పేరు చెప్పుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు.
“కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్‌హౌస్‌లో ఉండిపోయి పార్టీని కేటీఆర్‌కు అప్పగిస్తే నిర్వహించలేకపోయారు. కనుకనే ఈ వయసులో ఓపిక లేకపోయినా ఆయన మళ్లీ బయటకు రావాల్సి వచ్చిందని,” సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
కనుక తన అసమర్థతను, వైఫల్యాన్ని ప్రత్యర్థులు వేలెత్తి చూపిస్తే కేటీఆర్ దానిని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు నారా లోకేష్‌ను కూడా జగన్, వైసీపీ నేతలు ఆక్షేపించేవారు. అప్పుడు ఆయన వారికి ఈ విధంగా జవాబులు చెబుతూ తన లోపాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించలేదు!
వాటన్నిటినీ సరిదిద్దుకొని రాజకీయాల్లో రాణిస్తూ ఇప్పుడు అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయన కూడా తండ్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావిస్తున్నప్పటికీ అవసరమైనప్పుడే వాడుకుంటున్నారు తప్ప ఇలా రోజూ కాదు. ఎందుకంటే మంత్రి నారా లోకేష్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు కనుక.
కానీ కేటీఆర్ మాత్రం తన మాటకారితనంతో తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ అహంకారంగా మాట్లాడారు. ఆ మాటకారితనంతో తాత్కాలికంగా అందరినీ నవ్వించవచ్చు. కానీ లోపాలు సరిదిద్దుకోకుండా అహంకారంగా వ్యవహరిస్తుంటే అదే మా కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ఊరికే అనలేదని గ్రహిస్తే మంచిది.
Payal Radhakrishna turns up the glamour in a shimmering bronze halter dress that feels playful,…
Bhuvneshwar Kumar is finally back in the Indian team after four years. At 36, the…