
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే కాంగ్రెస్ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టినందునే అని ఇంతకాలం చెప్పుకొంటున్న ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లోక్‌సభ సన్నాహక సమావేశాలలో మెల్లమెల్లగా ఒకటొకటీ పార్టీలో జరిగిన తప్పులు లేదా లోపాలను బయటపెట్టుకుంటున్నారు.
ముందుగా టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం చాలా పెద్ద తప్పు… అని సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ద్వారా చెప్పించేశారు. అంటే కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వలన పార్టీకి నష్టం జరిగిందని చెపుతున్నారన్న మాట!
దళిత బంధు పధకాన్ని ఎన్నికలలో ‘గేమ్ చేంజర్’ అని కేటీఆర్‌తో సహా అందరూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పధకం కొందరికే (బిఆర్ఎస్ కార్యకర్తలకే) అందిందని దాంతో మిగిలినవారు ఆగ్రహంతో బిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కేటీఆర్ ఒప్పేసుకున్నారు. ఇదివరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపిస్తే కేటీఆర్ కొట్టిపాడేశారు. అదే కొంప ముంచిందని ఇప్పుడు తాపీగా ఒప్పుకుంటున్నారు.
రైతు బంధు పధకం నిజంగా అవసరమైన కౌలు రియాతులకు ఇవ్వకుండా వందల ఎకరాలున్న భూస్వాములకు, అసలు వ్యవసాయమే చేయని బీడు భూములకు లెక్కగట్టి ఇవ్వడం సరికాదని కాంగ్రెస్, బీజేపీలు చెపుతూనే ఉన్నాయి. కానీ కేసీఆర్, కేటీఆర్ వాటి మాటలను పెడచెవిన పెట్టారు. కానీ భూస్వాములకు రైతుబంధు ఇవ్వడం సరికాదని అర్దమైందని కేటీఆర్ ఇప్పుడు ఒప్పుకున్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లను కలవడానికి పార్టీలో మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చేవారు కారు. కేసీఆర్ ఏమి నిర్ణయిస్తే అదే శిలాశాసనం అన్నట్లు సాగేది. కానీ నిన్న జరిగిన భువనగిరి సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఇకపై పార్టీలో కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరినీ కలుస్తుంటామని, తరచూ వారితో సమావేశమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు.
ఇన్ని తప్పులు జరిగాయని కేటీఆర్ స్వయంగా చెప్పుకొంటూ మళ్ళీ బిఆర్ఎస్ ఓడిపోయినా 39 సీట్లు వచ్చాయి కనుక మేమే గెలిచామన్నట్లు చెప్పుకోవడం, కేసీఆర్ వస్తే సినిమా చూపిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామన్నట్లు బెదిరిస్తుండటం చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఇంకా అహంకారం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తున్నాయి. అయితే బిఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ చెప్పుకున్న కారాణాలన్నిటి కంటే ఈ అహంకారమే ముఖ్య కారణమని వారికి తెలియదనుకోలేము. అయినా మేమూ, మా అహంకారం మారవనుకుంటే నష్టపోయేది వారే!
The Andhra Pradesh government has reportedly finalised reservations for mayor posts in 17 municipal corporations…
Rumours about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 are spreading like wildfire. From speculation about…