ప్రముఖ దర్శకుడు, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే, సినీ కథా రచయిత, నటుడు, సింగీతం శ్రీనివాసరావు (94) అదివారం ఉదయం చెన్నైలోని కావేరి హాస్పిటల్లో కన్నుమూశారు.
గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాలపై ఆయనకున్న మక్కువ పోలేదు. ఆయనలో సృజనాత్మకత ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఈ వయసులో చివరిగా ‘సింగ్ గీతం’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రకృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అనే సందేశంతో ఎవరైనా సినిమా తీయగలరు. కానీ దానినీ ఎవరూ ఊహించని విధంగా ‘సింగ్ గీతం’గా తీసి జూన్‌లో విడుదల చేస్తే విమర్శకులు సైతం వేలెత్తి చూపలేకపోయారు.
సింగీతం శ్రీనివాసరావు నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన తల్లి శకుంతల ఆరోజుల్లోనే వయోలిన్ విద్వాంసురాలు. తండ్రి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయులుగా చేసేవారు. కనుక తల్లిదండ్రుల నుంచి సింగీతానికి అవసరమైన జ్ఞానం, బలమైన పునాది పడింది. విద్యార్థి దశలోనే కథా రచన, నాటకాలలో ప్రతిభ కనబరిచారు.
1972లో కృష్ణంరాజు, కాంచన జంటగా నటించిన ‘నీతి నిజాయితీ’ సినిమాతో సింగీతం సినీ ప్రస్తావన ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ తదితర పలు భాషలో 60కి పైగా సినిమాలు చేశారు.
జమీందారు గారి అమ్మాయి, అమెరికా అబ్బాయి, పంతులమ్మ వంటి ఆణిముత్యాల వంటి సినిమాలలో అద్భుతమైన పాటలు నేటికీ తెలుగునాట వినిపిస్తూనే ఉంటాయి. సింగీతం-కమల్ హాసన్ కలిసి చేసిన ప్రయోగాలు సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు నేటికీ సినీ పరిశ్రమకు ఓ డిక్షనరీ వంటివే.
అలాగే నందమూరి బాలకృష్ణతో చేసిన భైరవ ద్వీపం, ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఆదిత్య 369 అంటూ టైమ్ మిషన్‌తో చేసిన ప్రయోగం అయన ప్రతిభ, సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలుస్తాయి.
సమాజంలో అన్ని కోణాలను స్పృశిస్తూ మయూరీ, ఆడవాళ్ళకు మాత్రమే, మేడమ్ వంటివి కూడా సూపర్ హిట్ జాబితాలోనే ఉన్నాయి.
ప్రతీ సినిమాకు ఓ భిన్నమైన కథ, అనూహ్యమైన కాన్సెప్ట్.. తప్పనిసరి అన్నట్లు అయన తీసిన చిత్రాలన్నీ అపురూపాలే. చనిపోయే ముందు కూడా ‘సింగ్ గీతం’తో చివరి ప్రయోగం చేశారు.
ఆయన మరణ వార్త విన్నప్పుడు, ఈ చివరి ప్రయోగం చేసేందుకే ఇంతకాలం ఆయన జీవించారా?అది ముగియగానే ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారా?అని అనుకోకుండా ఉండలేం.
నేడు (ఆదివారం) చెన్నైలోని సింగీతం అంత్యక్రియలు జరగనున్నాయి. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు, ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాని కొందరు ఓ కళగా చూస్తారు. కొందరు కళాత్మక వ్యాపారంగా చూస్తారు. కానీ సింగీతం సృజనాత్మకతకు అద్దం పట్టేవే సినిమాలని భావిస్తారు. చివరి వరకు అదేవిధంగా సినిమాలు తీసి, టైమ్ మిషన్ ఎక్కి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. మన అదృష్టం బాగుంటే మళ్ళీ ఏదో నాడు ఏదో రూపంలో మన ముందుకు తప్పక వస్తారు.






