మా సినిమాకి కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందా లేదా? అనే సందేహంలో సినిమా రిలీజ్ చేశాం అని సమంత చెప్పినప్పుడు తనను తాను తక్కువ అంచనా వేసుకుందా? అనిపించింది. కానీ.. ఒక నిర్మాతగా, కథానాయకిగా ఆమెకు ఉన్న ఇన్సెక్యూరిటీ గురించి కూడా అర్థమైంది. అయితే.. ఆమె భయాలను మాత్రమే కాక ట్రేడ్ వర్గాల అంచనాలను కూడా తలకిందులు చేస్తున్నాయి “మా ఇంటి బంగారం” కలెక్షన్స్. రెండోవారంలోనూ సినిమాకి కలెక్షన్స్ విషయంలో ఉన్న హోల్డ్ అనేది మామూలు విషయం కాదు. అందుకే నార్త్ అమెరికాలో “మా ఇంటి బంగారం” 2M డాలర్స్ వసూలుకు చాలా దగ్గరలో ఉంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన “పెద్ది” కూడా ఈస్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. నెల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా ప్రీ బుకింగ్స్ లో 1M కూడా కొట్టలేకపోయింది. ఇక రిలీజ్ తర్వాత ఎంత ప్రమోట్ చేసినా 3.5 మిలియన్ మార్క్ కూడా దాటలేకపోయింది. రామ్ చరణ్, జాన్వికపూర్, జగపతిబాబు, శివన్న, దివ్యేందు వంటి భారీ తారాగణం, రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ వంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా కూడా రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ చేయలేకపోయింది, రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్ & జాన్వీ కపూర్ క్యారెక్టర్ ప్రొజెక్షన్ విషయంలో జరిగిన హడావుడి కారణంగా ఓవర్సీస్ ఆడియన్స్ సినిమావైపు వెళ్లలేదు. ఒకరకంగా ట్రేడ్ కి ఇది పెద్ద షాక్.
పెద్ది సినిమాకి దాదాపు 6M డాలర్లు బ్రేకీవెన్ టార్గెట్ ఉండగా.. 3.4 మిలియన్ దగ్గర ఆగిపోయింది. 3.5 మిలియన్ మార్క్ క్రాస్ చేయడం కూడా కష్టమే. ఈ క్రమంలో “మా ఇంటి బంగారం” 2 మిలియన్ మార్క్ కి చేరువవుతుండడం అనేది కంటెంట్ ఈజ్ కింగ్ అని విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఇది సమంత 18వ మిలియన్ డాలర్ సినిమా. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ యాక్సెప్ట్ చేయను అని సమంత పలుమార్లు చెప్పినప్పటికీ.. ఈ కలెక్షన్స్ & ఓవర్సీస్ లో ఆమెకు ఉన్న హోల్డ్ చూస్తుంటే.. సమంత తెలుగు లేడీ సూపర్ స్టార్ అనేది ఆమె అంగీకరించాల్సిందే.




