అభిమానం ఎన్ని ఆలోచనలు అయినా చేయిస్తుందని చెప్పడానికి ఓ ఉదాహరణ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట” నుండి ‘కళావతి’ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంగీత ప్రియులను, అభిమానులను అలరిస్తోన్న ఈ పాటలోని కొన్ని విజువల్స్ తీసుకుని, వాటిని హిందూ సంస్కృతికి ముడిపెడుతూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
గోపికల నడుమ నాట్యం చేస్తున్న కృష్ణుడి ఫోటోతో, ‘కళావతి’ పాటలో డాన్సర్స్ నడుమ మహేష్ ఉన్న ఫోటోను పోలుస్తూ ఓ పిక్, అలాగే సతీమణి నారచీరను సరిచేస్తున్న శివుని ఫోటోను ఓ వైపు, కీర్తి సురేష్ చీరను సరిచేస్తున్న మహేష్ ఫోటోను మరో వైపు పెట్టి… హిందూ సంస్కృతిని ‘కళావతి’ పాట తెలియజేస్తుందంటూ అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.
అత్యంత హాస్యాస్పదంగా మారిన ఈ ఫోటోలను సూపర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ఉదంతాలు ప్రతి సినిమాలోనూ కొన్ని వందల కొద్దీ ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటన్నింటిని హిందూ సంస్కృతితో పోల్చాలంటే కొన్ని వందల పేజీలు కావాలి.
అసలు సినిమా కధలన్నీ కూడా రామాయణ – మహాభారత గాధల చుట్టూనే తిరుగుతాయనే నానుడి ఎప్పటి నుండో ఉంది. ఎందుకంటే నేడు జరిగే ప్రతి ఉదంతానికి సంబంధించిన పునాది, రామాయణ మహాభారత ఇతివృత్తాలలో చరిత్ర రూపంలో మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. అలాంటిది ఓ పాటలోని సీన్స్ ఆ చరిత్రలను పోలి ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?
అయితే మహేష్ బాబు ఓ హీరోయిన్ చీర సరిచేయడం మాత్రం అభిమానులకు సరికొత్త అనుభూతులను పంచుతోంది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలకు మహేష్ బహు దూరంగా ఉంటారు. కానీ ‘కళావతి’ పాటలోని కీర్తి సురేష్ చీరను సరిచేస్తున్న వైనం సూపర్ స్టార్ ను అభిమానులకు కొత్తగా చూపిస్తోంది. మే 12వ తేదీన ఈ ‘సర్కార్ వారి పాట’ విడుదల కానున్న విషయం తెలిసిందే.



