ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కాస్టలీ అనేది నేటి రాజకీయ నాయకులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు రాజకీయాలు సామాన్యుడికి అందని ద్రాక్షే అని నిరూపిస్తున్నాయి.
ఒక్కో రాజకీయ నేత కేవలం ఒక్క స్థానిక ఎన్నికను ఎదుర్కోవాలంటే ఒక్కో కుటుంబానికి 8 వేలు ఖర్చుపెట్టాల్సిందేనా.? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాజాగా ఏపీలో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికలలో చాల ప్రాంతాలలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలు అవుతున్నారు.
కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కూడా సుముఖత చూపడం లేదు. దీనితో ఏకగ్రీవాలు అనేవి అనివార్యంగా మారుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో ఇరు పార్టీల మధ్య దాడులు వంటి ఘర్షణ వాతావరణం కూడా ఏకగ్రీవాలకు ఆస్కారం గా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో కూటమి హయాంలో జరుగుతున్న ఈ ఏకగ్రీవాలతో ఓటర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని, దసరా పండగ పూట కూటమి నేతలు వారి పొట్ట కొడుతున్నారంటూ రాచమల్లు ఏకగ్రీవాల లెక్కలు బయటపెట్టారు.
ఏకగ్రీవాల స్థానంలో ఎన్నికలు జరిగి ఉంటే ఓటర్లకు మీరు ఒక 2 వేలు మేమొక 2 వేలు ఇచ్చేవాళ్ళం. ఇలా ఒక్క కుటుంబంలో నలుగురు ఉంటే మీ పార్టీ నుంచి 8 వేలు, మా పార్టీ నుంచి మరో 8 వేలు మొత్తానికి 16 వేలు దక్కేవి. కానీ ఏకగ్రీవాలతో ఇప్పుడా పరిస్థితి లేదంటూ టీడీపీ ని నిందిస్తున్నారు.
దసరా పండగ పూట ఓటర్లకు వచ్చే ఆ 16 వేలు కూటమి నేతల ఏకగ్రీవాల వల్ల తమ చేతికి రాకుండా పోయాయంటూ అటు ఓటర్లు భావిస్తున్నారని, ఇటు తనది కూడా అదే అభిప్రాయపడుతున్నానంటూ రాచమల్లు ఓటర్ల కొనుగోలు – అమ్మకాలు ప్రక్రియ లెక్కల ఖర్చు 16 వేలుగా తేలుస్తున్నారు.
కేవలం స్థానిక ఎన్నికల కోసమే ఒక్కో కుటుంబానికి పార్టీలు ఈ స్థాయిలో వెచ్చిస్తే, ఇక సార్వత్రిక ఎన్నికల లెక్కల ఖర్చెంత.? అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి రాజకీయాలలోకి వచ్చిన నేతలు ప్రజల గురించి ఆలోచిస్తారా.? ప్రజా సమస్యలకు పెద్ద పీట వేస్తారా.? నియోజకవర్గ అభివృద్ధి మీద ద్రుష్టి పెడతారా.?
ఇప్పటి వరకు మీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ఖర్చు పెరిగింది అంటూ విపక్షాలు చేసే ఆరోపణలను విన్న సామాన్యులు ఇక నుంచి పెరిగిన ఓటు ఖర్చు, తగ్గిన ఓటర్ ఖర్చు లెక్కలు వినాలేమో…!





