తమ అభిమాన హీరో నటించిన తాజా చిత్రాన్ని ఎప్పుడెప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై చూడలా అని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు “స్పైడర్” కోసం వేచిచూస్తున్న విషయం తెలిసిందే. అంతా సజావుగా సాగితే, ప్రస్తుతం ‘స్పైడర్’ హంగామానే ఉండాలి. కానీ వాతావరణం అలా లేదు, స్తబ్దుగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… ‘స్పైడర్’ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని గందరగోళ పరిస్థితులలో ప్రిన్స్ అభిమానులు ఉన్నారని చెప్పాలి.
జూన్ 23వ తేదీ నుండి వాయిదా పడిన ఈ సినిమా ఆగష్టు 11వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుందని ఇటీవల హల్చల్ చేసిన సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రోగ్రెస్ రీత్యా, ఆగష్టుకు విడుదల కావడం అసాధ్యమని తేలిపోయింది. ఆగష్టు 9న ప్రిన్స్ పుట్టినరోజు కావడంతో, 11వ తేదీన విడుదలైతే అభిమానుల్లో ఉండే రెట్టించిన ఉత్సాహం నెలకొంటుందని భావించిన ఫ్యాన్స్ కు చేదు వార్తే ఎదురు కానుంది.
ఆగష్టు 11వ తేదీన కాదు కదా… 25వ తేదీకి కష్టమని, దసరా బరిలో “స్పైడర్” నిలుస్తుందని అందుతున్న సమాచారం ఫ్యాన్స్ కు మింగుడు పడని విషయమే. జూన్ విడుదల కాస్త నాలుగు నెలలు వాయిదా అంటే చాలా ఎక్కువ సమయం. అందులోనూ సినీ అభిమానుల్లో చాలా క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ గా “స్పైడర్” రూపుదాల్చుకున్న దరిమిలా, ఈ వాయిదాలు అభిమానులను పూర్తి నిరాశలోకి నెట్టివేస్తున్నాయి. అయితే మానసికంగా దసరాకు విడుదల అని ఫిక్స్ అయితే, ఇంకా ముందు విడుదల తేదీని ప్రకటిస్తే సంతోషపడవచ్చు.



