మంచు విష్ణు అధ్యక్షతలో టాలీవుడ్ పరిస్థితి పతనమా?

vishnu-manchu-tollywood

‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా వరుసగా రెండు సార్లు ఎంపికైన మంచు విష్ణు తన పదవికి ఏమాత్రం న్యాయం చేస్తున్నారు.? తనకున్న హోదాతో తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.? అనే ప్రశ్నలకు మంచు ప్యానల్ సభ్యులు సమాధానం చెప్పగలరా.? వివాదంలో తప్ప పరిష్కారంలో కనిపించని మంచు వారి పదవికి ప్రయోజనం ఉందా.?

ADVERTISEMENT

మా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల తరహాలో పోటీ పడి మరి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ, బహిరంగ విమర్శలు చేసుకుంటూ టాలీవుడ్ పరువును మీడియాలో పెట్టి తెలుగు సినిమా నటుల ప్రతిష్టను బజారుకెక్కించిన ఈ పెద్ద మనుషులు అసలు మా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత టాలీవుడ్ కు చేసిందేమిటి.? తెలుగు సినీ కార్మికులకు ఒరిగిందేమిటి.?

మా అస్సోసియేషన్ తరుపున ‘మా’ కుటుంబ సభ్యులందరికి సంబంధించిన ఒక భవనాన్ని నా సొంత డబ్బులతో నిర్మిస్తా, లేదా మంచు వారి పలుకుబడి ఉపయోగించి ఇళయరాజా వంటి లెజండరీ సంగీత దర్శుకుల చేత దేశ విదేశాలలో మ్యూజికల్ షోలు నిర్వహించి అక్కడ నుంచి వచ్చిన ఆదాయంతో ‘మా’ రూపురేఖలు మారుస్తా అంటూ రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రగల్భాలు పలికిన మంచు ప్యానల్ ఆ హామీలను నెరవేర్చే దిశగా ఒక్కఅడుగు ముందుకు వేయగలిగిందా.?

నేను అధ్యక్షుడునైతే తెలుగు సినీ కార్మికులకు ఇది చేసేస్తా, అది చేసేస్తా అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన మంచు విష్ణు చివరికి తెలుగు చిత్ర పరిశ్రమ రాజకీయ నాయకుల రాజకీయానికి బలి అవుతున్న సందర్భంలో కూడా కనీసం స్పందించలేకపోయారు. నాడు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ తో ఫుట్ బాల్ ఆడుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ వైఖరిని మంచు అధ్యక్షతన ఉన్న ‘మా’ ప్రశ్నించలేకపోయింది.

ఇక జగన్ తో టాలీవుడ్ పెద్దల రాయబారం అంటూ నడిచిన రాజకీయంలోనూ మా అధ్యక్షుడి హోదాలో మంచి విష్ణు జాడ ఎక్కడ కనిపించలేదు. అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా మంచు విష్ణు అధ్యక్ష హోదాకు పెద్దగా గౌరవం ఇవ్వలేదు, ఆయనను రాయబారానికి ఆహ్వానించను లేదు. దీనితో మంచు వారి పదవిని అటు ప్రభుత్వం గుర్తించలేదు, ఇటు చిత్ర పరిశ్రమ పట్టించుకోలేదు అనేది తేటతెల్లమయ్యింది.

ఇక నేడు సంధ్యా థియేటర్ ఘటన తో దేశంలోనే హాట్ ఓపిక గా మారిన పుష్ప వివాద నేపథ్యంలో కానీ, బన్నీ అరెస్టు విషయంలో కానీ, టాలీవుడ్ పై తెలంగాణ ప్రభుత్వం విధానాల పట్ల కానీ మా అధ్యక్షుడిగా మంచు విష్ణు స్పందన కరువయ్యింది. అయితే ఈ పుష్ప బెనిఫిట్ షోతో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ తో మొదలైన వివాదం టికెట్ రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షో ల రద్దు అంశం వరకు వెళ్లి యావత్ సినీ పరిశ్రమనే సంశయంలోకి నెట్టింది.

ఈ సమస్య పరిష్కారానికి కూడా మా అధ్యక్షుడిగా మంచు వేసిన ముందడుగు శూన్యమనే చెప్పాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు జరిపిన మంతనాలలో కూడా మా అధ్యక్షుడి ఊసు ఎక్కడ వినిపించలేదు, ఆయన జాడ ఎక్కడ కనిపించలేదు. నాడు మెగా స్టార్ చిరంజీవి అధ్యక్షతన ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన టాలీవుడ్, నేడు నిర్మాత దిల్ రాజు నాయకత్వంలో ముందుకెళ్లింది.

అంటే ఇన్నాళ్లుగా మా అధ్యక్షుడుకిగా మంచు విష్ణు అధిరోహించిన అధ్యక్ష పదవి కేవలం అలంకార ప్రాయమేనన్నమాట. ఆయన పదవికి కనీసం టాలీవుడ్ ప్రముఖులు కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు అనేది స్పష్టమయింది. ఇక ఇలా గుర్తింపు లేని పదవి కోసం మరి మంచు విష్ణు ఎందుకా పోరాటం చేసినట్లు.

పదవి కోసం హద్దు దాటి తోటి నటుల మీద నోరేసుకు పడ్డ ఈ మంచు కుటుంబం ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సమస్య వస్తే సైలెంట్ అయిపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతోంది. చిత్తశుద్ధి లేని పదవి, భక్తి లేని భజన నిష్ప్రయోజనమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories