
గత ఎన్నికల సమయంలో వైసీపీ ‘వై నాట్ 175’ నినాదాన్ని నిజం చేసుకునే నేపథ్యంలో ‘వై నాట్ నియోజకవర్గ మార్పు’ అంటూ ముందుకెళ్లారు వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా దాదాపు ఏపీలోని సగం నియోజకవర్గాలలో ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీలకు అత్యంత కీలకమైన ‘చిలకలూరి పేట’ నియోజకవర్గంలో అప్పటి వైసీపీ ఇంచార్జ్ విడుదల రజనీని గుంటూరు వెస్ట్ కు మార్చిన జగన్, పేట బాధ్యతలను కావట మనోహర్ నాయుడు చేతికి అప్పగించారు. అయితే కూటమి ప్రభావంతో అటు గుంటూరు ఇటు పేట లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.
అయితే వైసీపీ పార్టీ అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడితో పేట ఇంచార్జ్ గా రజని తిరిగి తన సొంత గూటికి చేరుకోగలిగింది. దీనితో ఎప్పటి నుంచో ఆ బాధ్యతల కోసం ఆశగా ఎదురు చూస్తున్న మర్రి రాజశేఖర్ జగన్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి.
2019 పేట వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న తనను కాదని విడుదల రజని కు అవకాశం ఇవ్వడంతో అలక బూనిన మర్రి రాజశేఖర్ నాడు పార్టీ నిర్ణయానికి తలవంచక తప్పలేదు. ఇక 2024 ఎన్నికల సమయంలో విడుదల రజనీని పేట నుంచి తప్పించడంతో ఆ బాధ్యతలు తిరిగి తన చేతికి చిక్కుతాయి అనుకున్న మర్రికి మరోసారి మొండి చెయ్యి చూపించారు జగన్.
ఇలా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాలతో తన పలుకుబడి చాటలేక పోయిన మర్రి ఇక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా తనకు పేట బాధ్యతలు అందకపోవడంతో ఇక వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు చర్చలు మొదలు పెట్టినట్టు సమాచారం.
ఇప్పటికే పేట టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తో మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినట్టు, పార్టీలోకి రావడానికి పత్తిపాటి ఆమోద ముద్ర వేసినట్టు ప్రచారం జరుగుతుంది. విడుదల రజని తన హయాంలో చిలకలూరి పేట ఇంచార్జ్ గా ఉంటూ మంత్రి పదవిని దక్కించుకుని తన అవినీతి, అక్రమాలతో పార్టీని పూర్తిగా నిర్జీవం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు మర్రి వర్గం.
ఇది ఇలా ఉంటే పార్టీ అధిష్టానం తో తనకున్న ర్యాపో, మాజీ మంత్రిగా తనకున్న అడ్వాంటేజ్ ను అవకాశంగా మార్చుకున్న రజని వైసీపీ పేట ‘రాణి’ గా చెలామణి అవుతూ ఆ నియోజకవర్గంలో మరో వైసీపీ నేతకు ఎదిగే అవకాశం ఇవ్వడం లేదంటూ రజని మీద ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
అయినా పార్టీ అధిష్టానం అటువంటి నేతలకే అవకాశం కల్పించడం దురదృష్టకరం అంటూ మర్రి, రజని వైఖరి మీద అధిష్టాన నిర్ణయం మీద గుర్రుగా ఉన్నట్టు ఆయన క్యాడర్ పేటలో ప్రచారం మొదలు పెట్టింది. అయితే మర్రికి 2024 ఎన్నికల ముందు జగన్ ఆయన్ను ఎమ్మెల్సీ పదవితో గౌరవించినప్పటికీ ఆయన పేటలో పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకే పార్టీ అధిష్టానం రజనికి తిరిగి పేట బాధ్యతలు అప్పగించిందంటూ రజని వర్గం మర్రి వర్గం మీద దుమ్మెత్తి పోస్తుంది.
ఏదిఏమైనప్పటికీ ఇలా వైసీపీ పార్టీలోని ఒక వర్గం మరో వర్గం మీద విమర్శలు చేసుకుంటూ వైసీపీ పేటలో వీరు ‘కలుపు మొక్క’ అంటే కాదు కాదు వీరే ఆ ‘కలుపు మొక్క’ అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పేట రాజకీయాల నుండి తప్పుకోవడానికి సిద్దమైన మర్రి కూటమిలో ఏ జెండా వైపు మొగ్గుచూపుతారో చూడాలి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…