చిరంజీవి సినిమా అంటేనే అభిమానుల్లో అదో రకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుకుని విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు తెగ మురిసిపోయి ఎప్పుడెప్పుడాని ఎదురు చూసే రోజులు ఎన్నో. కానీ ఇప్పుడా జోష్ లేదు. రాజకీయాలకు సెలవు చెప్పి వెండితెరకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 కమర్షియల్ గా సూపర్ హిట్ స్థాయిలో పే చేసింది. తర్వాత వచ్చినవేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆచార్య దారుణంగా బోల్తా కొట్టగా మంచి టాకే వచ్చినా సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లు మేజిక్ చేయడంలో విఫలమయ్యాయి. పోస్టర్లో వచ్చే లెక్కలు పక్కనపెడితే ఇవి మెగాస్టార్ రేంజ్ కాదు.
ఈ పరిస్థితిలో వాల్తేరు వీరయ్యతో వచ్చాడు చిరు. పదే పదే తాను మెగాస్టార్ వీరాభిమానని ఇరవై ఏళ్ళ క్రితం థియేటర్లలో ఊగిపోయిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా తీశానని దర్శకుడు బాబీ చెప్పిన సంగతి ఇంకా ఫ్రెష్ గానే ఉంది. అన్నట్టుగానే నిజంగానే అదే కాలంనాటి స్టఫ్ తో వీరయ్యని నింపేశాడు. డ్రగ్స్ దందా చేసే ఒక మాఫియా విలన్ డాన్, సముద్రం మీద ఆధారపడుతూ లైఫ్ ని జాలీగా గడిపే హీరో, కొన్ని అనూహ్యమైన సంఘటనల తర్వాత ఇద్దరి మధ్య క్లాష్, ఛాలెంజ్ విసురుకుని నువ్వా నేనా అని తలపడటం ఇదంతా చాలాసార్లు చూసిన రెగ్యులర్ ఫార్ములాలో వెళ్లిపోయింది.
ఎంత కాదనుకున్నా చాలా సినిమాల షేడ్స్ కనిపించాయి. ఎక్కడో కారడివిలో ఓ డెన్ను, హీరో చుట్టూ కామెడీ గ్యాంగ్, సముద్రంలో చేపలు పట్టే కథానాయకుడి వృత్తి గతంలో చూడనిది కాదు. ఇదే బాబీ తీసిన వెంకీ మామలో వెంకటేష్ ట్రాక్టర్ ని గాల్లో ఎగిరించి ఎటాక్ చేస్తే ఇందులో ఏకంగా ఏనుగు మీద చిరు వెళ్లి బాబీ సింహాతో తలపడతాడు. ఇక శృతి హాసన్ తో లవ్ కం కామెడీ ట్రాక్ గతంలో కాజల్ అగర్వాల్, సోనాలి బెంద్రేతో మొదలుకుని ముప్పై ఏళ్ళ క్రితం నగ్మా దాకా అందరితోనూ ట్రై చేసిందే. ఈ బాడీ లాంగ్వేజ్ ని చూసి చాలా కాలమవ్వడం ఒకటే కొంచెం కొత్తగా అనిపించేది.
ఇవన్నీ పక్కనపెడితే చిరంజీవి రవితేజల మాస్ మెగా కాంబో మాత్రం ఫ్రెష్ గా ఉంది. ఇద్దరు పరస్పరం తమ బ్లాక్ బస్టర్ల డైలాగులు రివర్స్ లో చెప్పుకోవడం విజిల్స్ వేయించే స్టఫ్. అన్నీ ప్రతికూలతలే ఉన్నాయని కాదు ట్రైలర్ లో చూపించినవన్నీ సగటు అభిమానికి నచ్చవచ్చు. కానీ సగటు ఆడియెన్స్ కోణంలో చూస్తే భారీగా ఉన్న యాక్షన్ విజువల్స్ తప్ప స్టోరీ పరంగా గొప్పగా అనిపించే మెరుపులేవని అనిపించే ప్రమాదం ఉంది. వీరసింహారెడ్డి సీరియస్ ఫ్యాక్షన్ డ్రాప్ తో బాలయ్య, వాల్తేరు వీరయ్య కామెడీ ఫైట్లు మసాలాతో చిరంజీవి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో.



