మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – శివసేన పార్టీల కూటమి అధికారానికి కావలసిన సీట్ల మార్కును దాటాయి. అనుకున్న దాని కంటే కాంగ్రెస్ బెటర్ గానే పెర్ఫర్మ్ చేసినా కాంగ్రెస్, ఎన్సీపీ అవకాశాలను చాలా చోట్ల అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ దెబ్బ తీసింది. ఈ పార్టీలకు పడాల్సిన ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చి బీజేపీకి మేలు చేసింది.
దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి. అటు హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపేవారు. ఆయా స్థానాల్లో ఎంఐఎం పార్టీ పెద్ద ఎత్తున స్థానాల్లో పోటీచేసి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది.
దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలువగలిగింది. మహారాష్ట్రలో ఎంఐఎం రెండు సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఔరంగాబాద్ నియోజకవర్గంలో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం.
ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. మరో నియోజకవర్గంలోనూ ఎంఐఎం బొటాబొటి మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా బీహార్ లోని కిషన్ గంజ్ నియోజకవర్గం లో కూడా ఎంఐఎం ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ ఎంఐఎం మొదటి సారిగా ఖాతా తెరవబోతుంది.





