
వైసీపి ఎమ్మెల్యేలను ప్రతిపక్షాలు ఓడించేపని లేకుండా వారి అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా వారిని ఓడించేస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పధకాల కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఇన్‌చార్జిలను మార్చే బటనే ఎక్కువ నొక్కుతున్నారు.
తాజాగా విజయనగరం జిల్లా ఎచ్చెర్ల వైసీపి ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్, విజయనగరం జిల్లా వైసీపి అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు అలియాస్ చిన్న శ్రీనుకి తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది.
ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్‌ని ఈసారి పక్కన పెట్టి ఎచ్చెర్ల నుంచి చిన్న శ్రీనుని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న శ్రీను మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన్న మేనల్లుడు. ప్రత్యర్ధులకు ఆయనంటే హడల్ అన్నంతగా రాజకీయాలలో బాగా రాటు తేలిపోయారు.
కనుక ఎచ్చెర్ల నుంచి చిన్న శ్రీనుని బరిలో దించిన్నట్లయితే ఆయనకు బొత్స సత్యనారాయణ సహాయసహకారాలు ఎలాగూ ఉంటాయి కనుక ఎచ్చెర్ల సీటుని వైసీపి తప్పక గెలుచుకోగలదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్‌ని మార్చాలనుకోవడానికి మరో కారణం కూడా కనబడుతోంది.
నియోజకవర్గంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనను మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారు. పైగా చిన్న శ్రీను ఎచ్చెర్లపై చాలా రోజులుగా కన్నేశారని, ఆయన ప్రోద్బలంతోనే ఎచ్చెర్ల వైసీపిలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ, ఈసారి ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్‌ని పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
శాసనసభ స్పీకర్‌గా వ్యవహరిస్తున్న ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పట్ల కూడా జగన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ టిడిపిలో బలమైన నేతగా పేరున్న కూన రవికుమార్‌ని ఎదుర్కొనేందుకు వైసీపిలో మరో బలమైన నేత లేకపోవడం తమ్మినేని సీతారాంకు కలిసివచ్చింది. లేకుంటే ఆయనను జగన్ పక్కన పెట్టేసేవారే.
కానీ ఎన్నికల గంట మ్రోగేలోగా ఏదైనా జరుగవచ్చు… తన స్థానంలోకి వేరే నియోజకవర్గం నుంచి ఎవరినైనా జగన్ దించవచ్చు కనుక తమ్మినేని సీతారాం కూడా ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…