తెలుగుదేశం హయాంలో చింతమనేని ఎలా చంద్రబాబుకు తరచూ తలపోట్లు తెచ్చేవారో, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అలా తయారయ్యారు. దాదాపుగా నెలకు ఒక వివాదాన్ని తెచ్చి పెట్టి ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెడుతున్నారు. తాజాగా ఆయన ఇంకో కేసులో ఇరుక్కున్నారు.
ఎమ్మెల్యే తనపై దౌర్జ్యనానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం అర్ధరాత్రి దీక్ష చేపట్టడం కలకలం రేగింది. ఈ దీక్ష తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో తన అనుచరుడుకి సంబంధించిన లేఅవుట్‌లో పంచాయితీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని, ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా మూడు రోజుల కిందట ఫోన్‌లో బెదిరించారని ఆమె పేర్కొన్నారు. కల్లూరిపల్లిలోని తన ఇంటికి శుక్రవారం రాత్రి మద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే తన ఇంటి వద్ద నీటి పైపు లైను ధ్వంసం చేశారని, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కేబుల్ వైర్ ను కట్ చేశారని సరళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వారు కేసు నమోదు చెయ్యకపోవడంతో ఆమె దీక్షకు దిగారు. అయితే ఈ వివాదం మీడియాలో ప్రముఖంగా రావడంతో చేసేది ఏమీ లేక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.





