
పారిస్‌లో జరుగుతున్న పారలింపిక్స్‌లో భారత్ షూటర్ అవని లేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్-1) ఈవెంట్‌లో 249.7 పాయింట్లు సాధించి తొలి స్వర్ణం సాధించగా, మరో షూటర్ మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో కాంస్యం సాధించారు.
స్వర్ణ పతకం సాధించిన అవని లేఖర గురించి అన్ని పత్రికలు, మీడియా వ్రాస్తాయి. కానీ ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యం రజతం సాధించిన మోనా అగర్వాల్‌కి లభించదు. అవని లేఖరతో పోలిస్తే మోనా అగర్వాల్ జీవన పోరాటం మరింత దుర్భరంగా సాగింది. ఆమె పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శప్రాయమే. అందుకే మోనా అగర్వాల్ గురించి ఈ సందర్భంగా నాలుగు ముక్కలు చెప్పుకుందాం.
మోనా అగర్వాల్ కూడా రాజస్థాన్‌కి చెందినవారే. నిరుపేద కుటుంబంలో మూడవ సంతానంగా పుట్టిన ఆమెకు 9 నెలల వయసులోనే పోలియో వ్యాది సోకి కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి. మగపిల్లాడు పుడతాడనుకుంటే ఆడపిల్ల పుట్టడం, పసివయసులోనే పోలియో సోకడంతో తల్లి తండ్రులు కూడా ఆమెను వద్దనుకునేవారు. కనుక గ్రామస్తులు, ముఖ్యంగా తోటి పిల్లలు అవహేళన చేసేవారు. ఆ విదంగా పసిప్రాయంలోనే మోనా జీవితం చాలా దుర్భరంగా మారింది.
అలా దుర్భర జీవితం అనుభవిస్తున్న ఆమెకు అంగవైకల్యం కలిగిన ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ రవీంద్ర చౌదరితో వివాహం జరిపించి పంపించేశారు.
అయితే అత్తవారింట్లో అడుగుపెట్టినా ఆమె కష్టాలు తీరలేదు. ఓ ప్రమాదంలో ఆమె భర్త మెదడుకి గాయమవడంతో మంచాన్న పడ్డాడు. కానీ అతని ద్వారానే పారలింపిక్స్ గురించి ఆమె తెలుసుకున్నారు. మంచన్న పడ్డ భర్త ప్రోత్సాహంతోనే తనకు సరిపడే వివిద క్రీడలలో ప్రయత్నించి చివరికి డిసెంబర్ 2021లో షూటింగ్‌ని ఎంచుకుంది. అంటే మూడేళ్ళ క్రితమే ఈ రంగంలో ప్రవేశించారన్న మాట! ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కానే కాదు.
కానీ అక్కడి నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది కానీ సాఫీగా మాత్రం సాగలేదు. ఓ వైపు మంచాన్న పడ్డ భర్త, ముగ్గురు పిల్లల కుటుంబ పోషణ భారం, మరోవైపు షూటింగ్ ప్రాక్టీస్ కోసం తుపాకీ, డబ్బు సమకూర్చుకోవడానికే మోనా అగర్వాల్ నానా కష్టాలు పడ్డారు.
అయితే దీని ద్వారానే తమ జీవితాలు బాగుపడతాయని, తన కంటూ సమాజంలో ఓ గుర్తింపు, గౌరవం లభిస్తాయని బలంగా నమ్మిన మోనా అగర్వాల్, ఎన్ని కష్టాలు, ఆర్ధిక సమస్యలు వచ్చినా క్రుంగిపోకుండా పట్టుదలగా ముందుకే సాగారు.
అటువంటి పరిస్థితులలోనే రోజుల తరబడి భర్త, పిల్లలని విడిచిపెట్టి శిక్షణ కోసం వెళ్ళినప్పుడు ఎంతో మానసిక క్షోభ అనుభవించేదానినని మోనా అగర్వాల్ చెప్పారు.
కానీ ఆమె కృషి, పట్టుదల, కఠోర శ్రమతో చివరికి పారలింపిక్స్ చేరుకొని భారత్‌కి రజత పతకం సాధించిపెట్టారు.
పారలింపిక్స్ కంటే ముందే 2023లో క్రొయేషియాలో జరిగిన వరల్డ్ కప్, ఆ తర్వాత 2024, ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ కప్ పోటీలలో కూడా పాల్గొన్నారు. దక్షిణ కొరియా పోటీలో బంగారు పతకం సాధించారు.
జీవితంలో చిన్న చిన్న సమస్యలకు, కారణాలకు క్రుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఓసారి మోనా అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న ఈ కష్టాలతో పోల్చి చూసుకుంటే తమ కష్టం ఎంత చిన్నదో గ్రహించగలుగుతారు. మోనా అగర్వాల్‌కి రెండు కాళ్ళు లేకపోవచ్చు. కానీ ఆమె తన పోరాట స్పూర్తితో భారతదేశానికే గర్వకారణంగా నిలిచారు.
Mithun Chakraborty is playing villain role in Rajinikanth's Jailer 2. But before signing the film,…
Success may have changed Vijay Deverakonda’s life, but it hasn’t changed the way he thinks.…