
టిడిపి, జనసేనలు కలిస్తే రాష్ట్రంలో కాపు సామాజికవర్గం అంతా వాటివైపు వెళ్ళిపోతే వైసీపి నష్టపోతుందనే భయంతో వాటిని కలవకుండా ఉంచేందుకు వైసీపి చేయని ప్రయత్నం లేదు. కానీ జగన్ స్వయంగా వాటిని కలిపేశారు.
కనుక కనీసం కాపు ఓటర్లను వాటివైపు వెళ్ళకుండా అడ్డుకొనేందుకు లేదా కనీసం వారి ఓట్లు చీల్చి నష్టం తగ్గించుకోవాలని వైసీపి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కాపు ఓటర్లను ఆకర్షించేందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభానికి పెద్దాపురం టికెట్ ఆఫర్ చేసి వైసీపిలోకి రప్పించాలనుకున్నారు.
అందుకు ఆయన కూడా సిద్దపడ్డారు. కానీ టికెట్ విషయంలో జగన్ తనతో గేమ్స్ ఆడుతున్నట్లు ఆయనకు అనుమానం కలగడంతో వైసీపిలో చేరబోనని, జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించేశారు.
కాపు సామాజిక వర్గానికే చెందిన క్రికెటర్ అంబటి రాయుడుకి గుంటూరు లోక్‌సభ టికెట్ ఆశజూపి వైసీపిలో చేర్చుకుని, అతనితో కూడా ఇలాగే వ్యవహరించడంతో అతను కూడా వైసీపికి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు.
కాపు సామాజిక వర్గంలో మంచి పేరు, ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధని గత ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోగా దారుణంగా అవమానించడంతో ఆయన టిడిపిలో చేరిపోయారు. ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ కోసం మళ్ళీ ఆయన స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్ని రాయబారాలు నెరిపినా వంగవీటి రాధ వైసీపిలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.
ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా వైసీపిలో కాపు నేతలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు తదితరులు కూడా జనసేనలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. నాలుగో జాబితా ప్రకటిస్తే మరికొంతమంది వైసీపికి గుడ్ బై చెప్పేసి టిడిపి, జనసేనలలో చేరవచ్చు.
అంటే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని, నేతలను విడగొట్టి లాభపడాలనుకున్న జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా వారందరినీ టిడిపి, జనసేనలలోకి పంపిస్తున్నారన్న మాట! అంటే జగన్ తన ఓటమికి తానే ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న మాట! కనుక టిడిపి, జనసేనలు గెలిచేందుకు జగన్ సాయపడతానంటే వద్దంటాయా?
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…
Mythological subjects have managed to leave an impression on the audience over the last few…