రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ వచ్చి పడిన ఇసుక కొరతపై పోరాటాన్ని ప్రధానప్రతిపక్ష పార్టీ, టీడీపీ ఉద్ధృతం చేసింది. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దీక్షకు దిగారు. లోకేశ్ కు సంఘీభావంగా పార్టీ నేతలు నక్కా ఆనంద్ బాబు, గల్లా జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుండీ లోకేశ్ ప్రజాపోరాటాలలో పాల్గొనడం ఇదే మొదటి సారి. గతంలో టీడీపీకి తెరవెనుక నుండి పని చేసిన లోకేశ్ 2015లో రాజకీయాలలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. మంత్రిగా తన శాఖలలో విశేష పనితీరు కనబర్చి కేంద్రప్రభుత్వం చేత అనేక అవార్డులు తీసుకున్నారు. ఆయన వాగ్ధాటి మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా పనితీరు పరంగా భేష్ అనిపించుకున్నారు అనే చెప్పాలి.
అయితే 2019 ఎన్నికలలో లోకేశ్ మొదటి సారిగా ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం, పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో ఆయన మొట్టమొదటి సారిగా ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. ఈ క్రమంలో తన మొదటి ప్రజాపోరాటం ద్వారా మరో కీలక అడుగు వేశారు. దీనితో ఈ కొత్త పాత్రలో లోకేశ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైకాపా నేతలు దొచుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఆ మరణాలపై ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారైనా సమీక్షించారా? అని లోకేశ్ ఈ సందర్భంగా నిలదీశారు. సాయంత్రం 5 గంటల వరకూ టీడీపీ నేతల నిరసన దీక్ష కొనసాగనుంది.





