ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఉన్న అన్ని వనరులను వాడుకుంటూ ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్. 2019 ఎన్నికలలో ఒక్క ఛాన్స్ అంటూ యాత్రలు చేసిన జగన్ 2024 ఎన్నికలలో తాను చేసిన యాత్రలను మరోసారి వెండి తెర మీద చూపిస్తూ మరో ఛాన్స్ అడగడానికి ‘సిద్ధం’ అయ్యారు.
అయితే జగన్ గతంలో జరిగిన యాత్రను మొత్తం చూపిస్తున్నారా..?లేక ప్రజలు గుర్తుంచుకోవలసిన వరకే చూపిస్తున్నారా..? అనేది మూవీ విడుదలైన తరువాతనే తెలుస్తుంది. ఈ యాత్రలో జగన్ కు తోడు నీడగా తన సోదరి షర్మిల కూడా ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ లో మాత్రం ఎక్కడ షర్మిల జాడ కనపడలేదు.
యాత్ర ట్రైలర్ లో ….”ఎన్నికలు అయిపోయాక జనాలను మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేను అన్నా” అంటూ జగన్ పాత్ర చెప్పే ఒక డైలాగ్ రేపటి నుండి ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాన్ని అందినట్టే భావించాలి. దీనికి కారణంలేకపోలేదు. జగన్ ప్రతిపక్షం లో చేసిన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే రాజధానిని ఇక్కడి నుండి మార్చేస్తా అంటూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవము లేదు.
నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను. మన రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చాక ఏమైందో అందరికి తెలిసిన చరిత్రే. అలాగే నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే వచ్చే ఎన్నికలలో లోపు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళతాను.
అప్పుడే ప్రజల ముందుకు వచ్చి ఓటడుగుతాను అంటూ జగనన్న ఇచ్చిన హామీ ఎటుపోయిందో..?ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో..?నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం. ఇదేనా అన్నా క్రెడిబిలిటీ అంటే, అంటూ వైసీపీ కి విమర్శలు మొదలవుతాయి. అలాగే గత ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర, కోడికత్తి వేటు అంటూ అల్లిన కట్టుకథకు ఈ యాత్రలో క్లైమాక్ ఉంటుందా..? అన్నా అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి.
అలాగే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జగన్ విజయం వెనుక ఖచ్చితంగా షర్మిల కష్టం ఉంది. మరి యాత్ర ట్రైలర్ చూస్తుంటే షర్మిలను ఎడిటింగ్ లో లేపేసారా..? అన్నట్లుగా ఎక్కడ ‘షర్మిల కనపడలేదు, వినపడలేదు’. దీనితో ట్రైలర్ చూస్తుంటే “చెల్లి యాదికొస్తుందే” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. యాత్ర 1 విడుదల సమయంలో సొంతవారిగా ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు యాత్ర 2 సమయానికి ప్రత్యర్థులుగా మారిపోయారు.
జరిగిన కథ పాతది దానిని మార్చలేము. ఇప్పుడు ఈ యాత్ర పాత మిత్రులకు కొత్త ఆయుధాన్ని అందించినట్టే. ఇప్పటికే షర్మిల అటు వైసీపీ పార్టీకి ఇటు జగన్ కు పెద్ద గుదిబండలా మారింది. తీసి పక్కన పెట్టలేరు, దాటి ముందుకు వెళ్ళలేరు. ఇక ఈ యాత్ర పై వేటకు షర్మిల “సిద్ధం” అవుతారేమో. గత ఎన్నికలలో తనకు తన పార్టీకి బలంగా మారిన యాత్ర, షర్మిల రెండు ఈ ఎన్నికలలో జగన్ కు బలహీనంగా మారడం ఏ దేవుడి స్క్రిప్టో మరి..!






