
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళ వైసీపి పాలన జరిగిన అరాచకాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల గంట మ్రోగినప్పటి నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా నేటికీ జరుగుతున్న అరాచకాలు మరో ఎత్తు అని అనిపించక మానదు.
రాష్ట్రంలో ఈ పరిస్థితులను చూసే, డీజీపీ, పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసింది. అయినా కొంత మంది అధికారులలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి తన విమాన టికెట్ కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రవాస వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌పై పోలీసులు దాడి చేయడం, ఆయనను జీపులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి చితకొట్టడమే ఇందుకు నిదర్శనం.
ఇంతకీ ఆయన చేసిన పాపం ఏమిటంటే, జగన్ ప్రభుత్వం తీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటమే. కనుక గన్నవరం విమానాశ్రయం వద్ద సిఎం జగన్ విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ఆయన కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయం వద్దకు తన అనుచరులను వెంటనే చేరుకోవాలని ఆయన మెసేజులు పెట్టారని పోలీసులు ఆరోపించారు.
వారి ఆరోపణలో నిజానిజాలను పక్కన పెట్టి చూస్తే, ముఖ్యమంత్రి విదేశాలకు వెళుతుంటే అడ్డుకోవలసిన అవసరం ఆయనకు ఏమిటి? అడ్డుకుని ఏం సాధించగలరు?ఒకవేళ సిఎంని అడ్డుకోవాలన్నా సాధ్యం కాదని, పోలీసులు వెంటనే తనని అరెస్ట్ చేస్తారని ఆయనకు తెలుసు కదా?
డాక్టర్ లోకేష్ జగన్ ప్రభుత్వాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆదివారం అమెరికా తిరుగు ప్రయాణం కాబోతూ రెండు రోజుల ముందు చేజేతులా ఇటువంటి సమస్య సృష్టించుకుంటారా?అంటే కాదనే అర్దమవుతోంది. అయితే ఆయన జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కనుక ఈ వంకతో ఆయనను అరెస్ట్ చేసి చితకొట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు భావించాల్సి ఉంటుంది.
అయితే డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌కు గ్రీన్ కార్డు కలిగిన అమెరికా పౌరుడు. కనుక తనపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని ఆయన భారత్‌లోని అమెరికా ఎంబసీకి, ప్రధాని కార్యాలయానికి, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి ఫిర్యాదు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రాకు చెందిన నాకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రశ్నించే హక్కు లేదా?ప్రశ్నిస్తే ఇలా ఏదో వంకతో అరెస్ట్ చేసి హింసిస్తారా?ఒకవేళ నా పిర్యాదుపై డీజీపీ స్పందించకపోతే హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి ఆయనను, సీఎస్ జవహార్ రెడ్డిని కూడా కోర్టుకి రప్పిస్తాను. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను,” అని డాక్టర్ లోకేష్ అన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనని చూసినప్పుడు, జగన్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు కూడా ఇలాగే అరాచక పాలన సాగిస్తోందే అని అనిపించక మానదు. అసలు ఈవిదంగా వ్యవహరిస్తుంటే తమ ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో? అనే ఆలోచన చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటే ఇదేనేమో?
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…