‘బాహుబలి’ సినిమా నెలకొల్పిన ఒక్కో రికార్డు క్రమంగా బద్ధలవుతోంది. ప్రీ రిలీజ్ కు ముందే దాదాపు 150 కోట్ల బిజినెస్ జరుపుకున్న ‘బాహుబలి’ ఏరియాల వారిగా నెలకొల్పిన రికార్డులను అప్ కమింగ్ అగ్ర హీరోల సినిమాలు బద్దలు చేస్తూ సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఏరియాలలో ‘సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ సినిమాల బిజినెస్ లు ‘బాహుబలి’ని మించగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” కూడా అదో జాబితాలో చేరింది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేరళ హక్కులు దాదాపుగా 4.20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సినీ వర్గాల్లో మాలీవుడ్ గా పిలుచుకునే ఈ ఏరియాలో ‘బాహుబలి’ సినిమా 3.25 కోట్లకు అమ్ముడై 14 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అయితే గతంలో లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కేరళలో ఈ రేంజ్ బిజినెస్ చేయడానికి ప్రధాన కారణం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కాదని టాక్.
“జనతా గ్యారేజ్”లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో, ఈ సినిమాకు మాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడిందని సమాచారం. ఈ కారణంతోనే ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా జూనియర్ మాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరచుకునే అవకాశమైతే కలిగినట్లే! ప్రీ రిలీజ్ లో బద్దలైన రికార్డులు, రేపు విడుదలైన తర్వాత వసూళ్ళ విషయంలోనూ బద్దలు కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.



