తెలుగు వాడి గమనాన్ని మార్చిన శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినోత్సవం మే 28వ తేదీ నాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కారణజన్ముడిగా కీర్తించే ఎన్టీఆర్ జన్మదినం కేవలం ఆయన అభిమానులకే పరిమితం కాలేదు, అలాగే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకే పరిమితం కాలేదు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన వ్యక్తిగా జననీరాజనం అందుకున్న ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు, ఈ ఏడాది మెగాస్టార్ హంగామా చేయబోతున్నారు.
అవును… రీ ఎంట్రీతో ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చి, సిల్వర్ స్క్రీన్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న “ఖైదీ నంబర్ 150” సినిమా బుల్లితెరపై సృష్టించబోయే హంగామాకు ఎన్టీఆర్ పుట్టినరోజు వేదిక అయ్యింది. చిరు సినిమాతో పాటు విడుదలైన బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి,’ శర్వానంద్ ‘శతమానం భవతి’ సినిమాలు ఇప్పటికే బుల్లితెరపై ప్రదర్శితం కాగా, తాజాగా మెగాస్టార్ వంతు వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ పై సరికొత్త టీఆర్పీతో రికార్డు కొడతారేమో చూడాలి.
ఇటీవల కాలంలో బుల్లితెరపై సినిమాలకు ప్రజాధరణ బాగా తగ్గిపోయింది. సిల్వర్ స్క్రీన్ పైనే ఎక్కువ మంది చూడడం వలనో గానీ, బుల్లితెరపై ఎక్కువ యాడ్లు ప్రదర్శితం వలనో గానీ, గత ఏడాదిన్నర్ర కాలంలో సరైన సినిమా ఒక్కటి కూడా స్మాల్ స్క్రీన్ పై నమోదు కాలేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా మంచి టీఆర్పీ రేటింగ్స్ నే అందుకున్నప్పటికీ, అది రికార్డు స్థాయిలో లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ప్రదర్శితం కాబోయే “ఖైదీ నంబర్ 150”తో మళ్ళీ బుల్లితెరకు గత వైభవం వస్తుందేమో చూడాలి.


