మెగా వారసురాలు నిహారిక వెండితెరపై ఎంట్రీ ఇచ్చేసింది. సినిమాకు పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా, ఒక ఫీల్ గుడ్ సినిమాను తెరకేక్కించారన్న సినీ విశ్లేషకుల ప్రశంసలు అయితే అందుకుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ లో మెగా బలం ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే తూర్పు గోదావరి జిల్లా, అనపర్తిలోని ఓ ధియేటర్లో ‘ఒక మనసు’ ఓపెనింగ్ డే సందర్భంగా ధియేటర్ యాజమాన్యం ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
అనపర్తిలోని ‘సూర్యశ్రీ’ ధియేటర్ లో ప్రదర్శింపబడుతున్న ‘ఒక మనసు’ సినిమా నాలుగు షోలకు నాలుగు బహుమతులను ధియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ప్రతి ఆటకు అమ్ముడైన టికెట్లను లాటరీ పద్ధతిలో ఇంటర్వెల్ సమయంలో ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేసారు. దీంతో సినిమాకు వచ్చిన వారిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా బహుమతి కొట్టడం ఖాయం. ఈ ఆఫర్ కు స్థానిక వాసుల నుండి మంచి స్పందన రావడం విశేషం. అయితే ఇది ప్రతి రోజు, ప్రతి సినిమాకు మాత్రం కాదు.
మెగా తనయురాలు ఎంట్రీ ఇవ్వబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘డీల్’ ఇది. గతంలో చిన్న సినిమాలకు ఈ తరహా ప్రమోషన్స్ ఇచ్చేవారు. అప్పుడు సినిమా నిర్మాణ సంస్థల నుండి కూడా ప్రకటనలు వచ్చేయి. కానీ, రానూ రానూ ఈ ఒరవడికి తిలోదకాలు ఇచ్చేయగా, మళ్ళీ ‘ఒక మనసు’ దానికి పునర్వైభవం తెచ్చిపెట్టింది.



