కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చినప్పటికీ., బుల్లితెర అభిమానులకు కావలసినంత ఎంటెర్టైన్మెంట్ ను అందించింది. కరోనా వ్యాప్తిని నివారించే ప్రక్రియలో ప్రపంచమంతా లాక్ డౌన్ కారణంతో ఇళ్లకే పరిమితమైన సమయంలో అందరి ఇంటి తలుపు తట్టింది “ఓటిటి ప్లాట్ ఫారం”.
చూస్తున్న ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే మూసకాలపు సీరియల్స్ నుండి ఏడూ, ఎనిమిది ఎపిసోడ్స్ తో ముగింపు పలికే వెబ్ సిరీస్ లను అందిస్తూ ఇటు బుల్లి తెర అభిమానులతో పాటు అటు వెండి తెర అభిమానులను కూడా తన వైపు తిప్పుకుంది ఈ ఓటిటి ప్లాట్ ఫారం. కొత్త,చిన్న నటి నటులతో, దర్శకులతో,మొదలైన ఓటిటి ప్లాట్ ఫారం ఇప్పుడు అగ్ర స్థాయి కథానాయకులను కూడా తన వైపు ఆకర్షించేలా ఎదిగింది.
వెంకీ మామ, రానా దగ్గుపాటి, నాగ చైతన్య, సమంత, తమన్నా,లావణ్య త్రిపాఠి, కాజోల్ అగర్వాల్ వంటి అగ్రస్థాయి నటీనటుల నుండి ఆది, రాజ్ తరుణ్, శివాత్మిక, లక్ష్మి మంచు,నిత్యా మీనన్, ఇషా రెబ్బ వంటి చిన్న స్థాయి నటుల వరకు ఈ ఓటిటి లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లో నటించి భాగస్వాములయ్యారు. కరోనా సమయంలో సూర్య, నాని వంటి స్టార్ హీరోలు కూడా తన సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసి సంచలం సృష్టించారు.
అలాగే నానాటికి ఈ బుల్లితెర ప్లాట్ ఫారం తన పరిధిని విస్తరించుకుంటూ వెండి తెర అగ్ర స్థాయి సినీ నిర్మాతను సైతం భయపెడుతుంది అంటే అతిశయోక్తి కాదు. అలాగే కుటుంబ సమేతంగా ధియేటర్ లో సినిమా చూడడానికి వెళ్లాలంటే సామాన్య మధ్యతరగతి జేబు ఖాళీ కావడం ఖాయంగా కనపడడంతో ఓటిటి నే నమ్ముకుంటారు. సినిమా జయాపజయాలను ఆధారంగా చేసుకుని నిర్మాతలు ఆ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయడంతో ధియేటర్ కు వెళ్లలేని సినీ అభిమానికి ఓటిటి ఒక “వరం”లా మారితే, అదే సినీ నిర్మాతకు “శాపం”లా తయారయ్యింది.
అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్,సోనీ లీవ్…వంటి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే ప్రజాదరణతో ముందంజలో ఉన్నాయి. “ప్రాంతాల సరిహద్దులను చెరిపేసి, భాషా బేధాలను పక్కనపెట్టి”…ప్రతి ప్రేక్షకుడి ఇంటి తలుపు తడుతున్నాయి ఈ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్. అలాగే వెబ్ సిరీస్లతో ప్రేక్షకులకు వినోదంతో పాటుగా హర్రర్, త్రిల్లర్, సస్పెన్స్ వంటి అన్ని రకాల రుచులను అందించడంతో ప్రేక్షక ఆదరణ అంచలంచలుగా పెరుగుతుంది.
అయితే ఈ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ లతో ప్రేక్షకుడికి జేబు ఖాళీ కాకుండా “వినోదం” ఎలా అయితే అందుబాటులోకి వచ్చిందో అలాగే “అశ్లీలం” కూడా ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుంటూ లోపలి వచ్చేసింది.దీనితో ఏ సదుపాయానికైనా మంచి చెడులు అనే రెండు కోణాలు ఉంటాయని మరోసారి రుజువయ్యింది.




