పాన్ ఇండియా మోజు… పాయింట్ ఆఫ్ నో రిటర్న్!

Pan India Telugu cinema

తెలుగు సినీ పరిశ్రమ ఓ పక్క జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమా అంటే పాన్ ఇండియా సినిమాయే.. లేకుంటే సాటి హీరోలు, దర్శకులు, వారి అభిమానులు ముందు చులకనవుతామనే అభిప్రాయం అందరిలో బలంగా నాటుకుపోయినట్లనిపిస్తోంది.

కనుక ఇంతకాలం సొంత ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయిన పెద్ద హీరోలు, ఇప్పుడు ‘పాన్ ఇండియా సినిమా’ అనే చట్రంలో చిక్కుకుపోతున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

అయితే పాన్ ఇండియా సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయా? హీరోలు, దర్శకులకి మంచి పేరు ప్రతిష్టలు, నిర్మాతలకు భారీగా లాభాలు, ప్రేక్షకులకు సంతృప్తి కలిగిస్తున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు అందరికీ బాగా తెలుసు.

పాన్ ఇండియా సినిమాలో కనిపించేది బారీ బడ్జెట్.. సినిమా నిర్మాణంలో భారీతనం వగైరా. కానీ ఆత్మ లోపిస్తుంది. ఉదాహరణకు తమిళ లేదా మళయాళ నేటివిటీతో తెలుగులో వస్తున్న సినిమాలు బాగుంటే తెలుగు ప్రజలు చూసి ఆనందిస్తారు కానీ వాటిని ఓన్ చేసుకోలేరు కదా?

అదేవిధంగా ‘ఆత్మ లోపించిన’ పాన్ ఇండియా తెలుగు సినిమాలను ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా ఓన్ చేసుకుంటారు? ఆయా రాష్ట్రాల ప్రజలకు పరిచయమున్న ఓ నలుగురు నటీనటులను పాన్ ఇండియా సినిమాలో ఇరికిస్తే చాలు… అది తమ సినిమాయే అనుకోని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారనుకోవడం దురాశే కదా?

ఈ పాన్ ఇండియా మోజులో పడి ఒక్కో సినిమాకి 2-3 ఏళ్ళు కేటాయిస్తుండటం లేదా పాన్ ఇండియా సినిమా ముద్ర పడాలంటే కనీసం 2-3 ఏళ్ళు తీయాల్సిందే అనుకోవడం మరీ విడ్డూరం.

ఈ మాయలో పడి ఏడాదికి కనీసం మూడు, నాలుగు అచ్చమైన తెలుగు సినిమాలు చేసే అవకాశం వదులుకొని విలువైన ‘షెల్ఫ్ లైఫ్’ చేజార్చుకోవడం, అభిమానులను నిరాశ పరచడం కూడా సరికాదనిపిస్తుంది.

ఏడాదికి మూడు, నాలుగు అచ్చమైన తెలుగు సినిమాలు చేసి హిట్ కొడితే వచ్చే ఆనందం, అభిమానుల కళ్ళలో కనిపించే సంతోషం, ఓ పాన్ ఇండియా సినిమాతో వస్తుందా?

రానప్పుడు ఎందుకీ వెర్రి? మోజు? పాన్ ఇండియా సినిమాలు చేయకపోతే రేసులో వెనుకబడిపోయామనే భావన సరైనదేనా?అని ఆలోచిస్తే మళ్ళీ తెలుగులో పెద్ద హీరోల సినిమాలు చూసే భాగ్యం ప్రజలకు దక్కుతుంది. లేకుంటే ‘పాన్ ఇండియా’తో పరువు తీసుకున్నాక తెలుగు సినిమాకి తిరిగి రావడం చాలా నామోషీగా మారుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories