
ప్రశ్న: భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?
సమాధానం: 1947, ఆగస్ట్ 15వ తేదీన!
ప్రశ్న: మరైతే ఇంతకాలం గూడెం గ్రామంలో విద్యుత్ ఎందుకు రాలేదు?
సమాధానం: తెలీదు.
మొదటి ప్రశ్నకు యావత్ దేశ ప్రజలు తడుముకోకుండా సమాధానం చెప్పగలరు. కానీ రెండో ప్రశ్నకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు కూడా సమాధానం చెప్పలేరు. అధికారులు అసలే చెప్పరు. కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాత్రం రెండో ప్రశ్నకి మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్పారు.
నగరాలలో ఫ్లై ఓవర్లు, విశాలమైన రోడ్లు, తాజ్ మహల్ వంటి రైల్వే స్టేషన్లు కడితే అందరికీ కనిపిస్తాయి. వాటిని చూసి జనాలు ఓట్లు వేస్తారు. నగరాలు, పట్టణాలలో 24 గంటలు విద్యుత్ ఉండాలి లేకుంటే ప్రజలకు కోపం వస్తుంది. కానీ మారుమూల గ్రామాలకు ఇవేవీ అవసరం లేదు. కనీసం విద్యుత్ సదుపాయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ మారుమూల గ్రామాలు ఎవరికీ కనిపించవు. వాటిలో నివసించే ప్రజల గోడు ఎవరికీ వినిపించదు. కనిపించినా వినిపించినా పట్టించుకోవలసిన అవసరం లేదు కనుకనే.
దేశంలో, రాష్ట్రంలో కుల సర్వేలు చేయించి ఓటు బ్యాంకు లెక్కలు కట్టుకునే పాలకులకు మారుమూల గ్రామాలలో సర్వే చేయించి అక్కడి ప్రజల అవసరాలు, కష్టాలు, సమస్యల గురించి తెలుసుకోలేదా? అంటే ఖచ్చితంగా తెలుసుకోగలదు. కానీ ఇంతకాలం ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలోని మారుమూల కొండ శిఖరంపై గూడెం గ్రామం పరిస్థితి ఇదే. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలైనా ఇంత వరకు ఆ గ్రామానికి విద్యుత్ లేదు. అలాంటి గ్రామాలు దేశంలో, రాష్ట్రంలో కొన్ని వందలు వేలు ఉన్నాయి. కానీ ప్రతీచోట పవన్ కళ్యాణ్ ఉండరు. ఉండలేరు. కనుక ఆయన దృష్టికి వచ్చిన మారుమూల గ్రామాలకు తారురోడ్లు పడుతున్నాయిప్పుడు. విద్యుత్ సరఫరా అవుతోందిప్పుడు.
గూడెం గ్రామంలో కేవలం 17 కుటుంబాలే నివసిస్తున్నాయి. కానీ దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్నాయి. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆ గ్రామంలో ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి. అంతేకాదు ప్రతీ ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ కూడా పంపిణీ చేశారు. దీని కోసం విద్యుత్ శాఖ ప్రధాన రహదారి నుంచి ఆ గ్రామం వరకు 9.6 కిమీ మేర 217 విద్యుత్ స్తంభాలు వేసింది. ఇన్నేళ్ళ తర్వాత తొలిసారిగా చీకట్ల నుంచి బయటపడ్దామని సంతోషం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
A strange trend is slowly becoming visible in Tollywood. Some films are reaching theatres without…
Kayadu Lohar came into Tollywood with plenty of promise, but three films later, her Telugu…