కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. గుడివాడలో తన మీద విమర్శలు చేస్తున్న ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్న అని అనేవారికి గట్టిగానే సమాధానం చెప్పారు అనుకోవాలి. పవన్ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది.
“పేకాట క్లబ్బులు నడుపుతా మీరు రాజకీయం చేస్తుంటే… సినిమాలు చేసుకుంటా మేమేందుకు రాజకీయాలు చెయ్యకూడదని అడగండి… సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుతా మీరు రాజకీయం చేస్తుంటే… సినిమాలు చేసుకుంటా మేమేందుకు రాజకీయాలు చెయ్యకూడదని అడగండి. మీ మాటలు పడాలా? మీ దాష్టీకాలకు గురికావాలా? ఆరోజులు పోయాయి. పాతరోజులు అవి. ఎదురుతిరిగే రోజులవి,” అని నిప్పులు చెరిగారు.
గుడివాడలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగుచేయాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నానిని నిలదీయాలన్నారు. ఆయనకు పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత.. ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో లేదన్నారు. నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. నివార్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా పవన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.





