అసెంబ్లీ ఎన్నికలకు ఇలాగే వెళ్తారా? ఏమైనా ఆలోచిస్తారా?

TDP Janasena Rift: Trouble Ahead of 2029 AP Elections?

ఈ స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేనల గెలుపోటములకు కాక, వాటి ఐక్యతకు పరీక్షగా మారాయనిపిస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్న భీకర పోరాటాలు చూస్తుంటే. టీడీపి తీరు జనసేన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందనే ఆరోపణలు పదేపదే వినిపిస్తున్నాయి.

అలాగే జనసేనకు కేటాయించిన సీట్లను కూడా టీడీపి నుంచి వచ్చి చేరినవారు ఎగరేసుకుపోతున్నారనే ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా చూపుతున్నారు. ఏవిధంగా చూసినా టీడీపీ వలన తమకు తీరని అన్యాయం జరిగిందని జనసేన మద్దతుదారుల వాదనలు గట్టిగా వినిపిస్తోంది. వారి ఆవేదన, వాదనలు సహేతుకమే.

ADVERTISEMENT

ఇక టీడీపీని కష్టకాలంలో అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ఇలాంటి చిన్నచిన్న అవకాశాలు కూడా మిత్రపక్షాలతో పంచుకోవాల్సి వస్తే, రాజకీయంగా ఎదిగేందుకు తమకు ఎప్పుడు అవకాశం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన కూడా సహేతుకమే.

రాజకీయాలలో పొత్తులంటే పెళ్ళి వంటిదే. కనుక భార్యాభర్తలు ఏవిధంగా సర్దుబాట్లు చేసుకుని కలిసి జీవిస్తారో అలాగే పొత్తులో ఉన్న పార్టీలు కూడా ముందుకు సాగక తప్పదు.

కానీ భార్య భర్తల మధ్య విభేదాలు పరాకాష్టకు చేసుకుంటే విడాకులు తీసుకున్నట్లే, పొత్తులో ఉన్న పార్టీల మధ్య విభేదాలు, అసంతృప్తి పరాకాష్టకు చేరుకున్నప్పుడు విడిపోతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా టీడీపీ, జనసేనలు ఆ దశకు చేరుకున్నట్లే కనిపిస్తున్నాయి.

కనుక రెండు పార్టీలలో రగిలిన ఈ నిప్పుపై బూడిద జల్లి దాచేసే ప్రయత్నం చేసే బదులు, ఇలాంటి విభేదాలతో 2029 ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోగలం?

ఆ ఎన్నికలలో కూడా జనసేన ఇలాగే సీట్ల కోసం పట్టుబడితే ఏం చేయాలని టీడీపి, అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఏం చేయాలని జనసేన ఆలోచించుకుంటే మంచిది.

రెండు పార్టీలకు, రాష్ట్ర భవిష్యత్‌కు కూడా అత్యంత కీలకమైన 2029 ఎన్నికలకు ముందు ఇలాగే కీచులాడుకుంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే బదులు, ఇప్పటి నుంచే వాటి గురించి ఆలోచించి రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైన ఓ ప్రణాళిక రూపొందించుకుంటే మంచిది.

అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చని ధీమాగా ఉంటే కూటమిని రప్పారప్పా ఆడించేందుకు వైసీపీతో జగన్‌ సిద్ధంగానే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories