పార్టీ అధినేతగా కాదు పార్టీ అభ్యర్థిగా మారారు..!

Pawan Kalyan

లేట్ గా వచ్చినా అందరి దృష్టుని తనవైపుకు ఆకర్షించే లీడర్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉండే ఆ ఛరిష్మానే వేరప్పా అంటుటారు ఆయన ఫాలోవెర్స్. ఇపుడు అదే నిజం చేస్తున్నారు పవన్. ఇన్నాళ్లుగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అంటూ సొంత పార్టీ క్యాడర్ నుండే విమర్శలు ఎదుర్కున్న పవన్ ఒక్కసారి రంగంలోకి దిగితే పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలరు అనేది స్పష్టమయ్యింది.

తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజవర్గం నుండే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన పవన్ ఆరోగ్య కారణాల రీత్యా తిరిగి హైద్రాబాద్ వెళుతున్నారు అనే సమాచారం తో మళ్ళీ ఇంకెన్నాలకు బయటకు వస్తారో అంటూ నిరుత్సాపడిన పార్టీ క్యాడర్ కు, హమ్మయ్య అంటూ ఉపిరిపీల్చుకున్న వైసీపీ నేతలకు వెంటనే బదులిచ్చారు పవన్.

ADVERTISEMENT

ఇక సమయం లేదు మిత్రమా…అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పవన్. ఇన్నాళ్లుగా నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఒక ప్రాంతానికి పరిమితం కాను అంటూ మాట్లాడిన పవన్ వాస్తవాన్ని గ్రహించారు. ఎంతటి రాష్ట్ర స్థాయి నాయకుడైన తానూ పోటీ చేయబోతున్న ప్రాంతాన్ని విస్మరిస్తే వచ్చే ఫలితాలను గత ఎన్నికలలో చవిచూసిన పవన్ ఈసారి ఆ తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో పార్టీ అధినేత గా కాకుండా పార్టీ అభ్యర్థిగా పిఠాపురం ప్రజలతో మమేకమవుతున్నారు.

ఒక సాధారణ కార్యకర్త మాదిరి ఇంటి ప్రచారం చేస్తూ, అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ గత రెండు రోజుల నుంచి విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క ఆటోలో ప్రయాణం చేస్తూ, మరో పక్క సామాన్యుడి ఇళ్లకు వెళ్లి అక్కడి స్థానిక ప్రజలతో మాటామంతి జరుపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ఒక సామాన్యుడి ఇంటి తలుపు తట్టిన పవన్ అక్కడ ఉన్న నవారు మంచం పై కూర్చొని స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు.

దీనితో పవన్ ను దగ్గర నుంచి చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు అంటున్నారు స్థానికులు అరుపులు, కేరింతలతో సంబర పడిపోయారు. ఒక స్టార్ హీరో, ఒక పార్టీ అధినేత అయిఉండి ఒక సామాన్యుడిలా అందరితో కలిసి పోవడంతో స్థానిక ప్రజలలో పవన్ పట్ల గౌరవం, మర్యాద పెరగడంతో పాటు మా వాడు అనే నమ్మకాన్ని సాధించుకోగలిగాడు.ఇన్నాళ్ళుగా పవన్ నుంచి ఆశించింది ఇది కదా అంటూ ఆ పార్టీ క్యాడర్ తో పాటు ఆయన అభిమానులు కూడా పవన్ ప్రచార శైలిని అభినందిస్తున్నారు. ఎన్నికల చివరి వరకు ఇదే తీరుతో ప్రజాక్షేత్రంలో నిలబడగలిగితే ‘వై నాట్ 21 ‘ అనే నినాదాన్ని అందుకోవచ్చు పవన్.

ADVERTISEMENT
Latest Stories