ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటారు. వివిధ రాజకీయ అంశాల మీద ఆయన తరచు గట్టిగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవలే జరిగిన సాధారణ ఎన్నికలలో ఆయన బెంగళూరు సెంట్రల్ నుండి పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అయినా రాజకీయ అంశాల మీద ఆయన స్పందిస్తూనే ఉంటారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన స్పందించారు. “ఆయన నాకు సరిగ్గా అర్ధం కారు… అయితే సూటిగా చెప్పాలంటే… ఆయన నన్ను చాలా నిరాశపరిచారు. బీజేపీ ఏం చేసిందని పొత్తు అన్నారో నాకు అర్ధం కాదు. స్పెషల్ స్టేటస్ అన్నారు అది ఏమైందో తెలీదు,” ప్రకాష్ రాజ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ మోడీని యుగపురుషుడి లా కీర్తించిన విషయాన్నీ ప్రస్తావించగా… అది ఆయనకు కావొచ్చు నాకు కాదు. ఆయనకు మోడీ ఎంత గొప్ప అయ్యారో మనకు తెలీదు అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కేసీఆర్, కేటీఆర్ గురించి పొగడ్తలతో ముంచెత్తగా, జగన్ ప్రభుత్వం పై మాత్రం ఆచితూచి స్పందించారు.
“జగన్ గురించి స్పందించడానికి నాకు అక్కడ రాజకీయాల గురించి తెలీదు. అయితే నాకు మూడు రాజధానుల ప్రతిపాదన మాత్రం నచ్చలేదు. తప్పో ఒప్పో అమరావతిని రాజధాని అనుకున్నారు. అక్కడ రైతులకు అన్యాయం చెయ్యకూడదు. ఇటీవలే వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు కూడా ఆ ప్రతిపాదన పట్ల పెద్దగా ఆసక్తిగా ఉన్నట్టు అనిపించలేదు,” అని చెప్పుకొచ్చారు.






