
ప్రజారాజ్యం విఫల ప్రయోగం తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాలనుకోవడమే దుసాహాసం. నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు పవన్ కళ్యాణ్ పడిన శ్రమ, ఎదుర్కొన్న సవాళ్ళు, భరించిన అవమానాల గురించి అందరికీ తెలుసు.
ఒకానొక సమయంలో ఆయన కూడా పార్టీ మూసేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, నిలబడి పోరాడుతూనే ఉంటానని పదేపదే చెప్పారు. అలాగే ఆటుపోట్లు తట్టుకొని నిలబడి పార్టీని అధికారంలోకి తెచ్చారు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం కోసం కోట్లాదిమంది భారతీయులు పోరాడారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం తమ జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారి పోరాటాలు, త్యాగాలతో దేశానికి స్వాతంత్రం వచ్చింది.
వారి పోరాటాలు, త్యాగాల ఫలితాన్ని ఇప్పుడు అందరం అనుభవిస్తున్నాము. ఎవరి కోసమో మేమెందుకు పోరాటాలు చేయాలని ఆనాడు వారు అనుకొని ఉంటే?
అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హాయిగా సినిమాలు చేసుకుంటూ కోట్లు సంపాదించుకునే అవకాశం వదులుకొని ఎవరి కోసమో నేనెందుకు ఇంత కష్టపడాలి?ఎవరికోసమో నేనెందుకు ఈ అవమానాలు భరించాలి? అని అనుకొని ఉంటే?
మన పూర్వీకులు బ్రిటిష్ చెర నుంచి దేశాన్ని విడిపించి మనకు అప్పగిస్తే మన రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఏం చేస్తున్నారు?అనే ప్రశ్నకు ఒకటి కాదు వంద సమాధానాలున్నాయి. అవి అందరికీ తెలుసు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ కష్టం, కష్టార్జితంతో జనసేనని అధికారంలోకి తీసుకువస్తే, ఆ పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? రాజకీయ అనామకులుగా ఉన్న తమకు పదవి, అధికారం, సమాజంలో ఇంత గుర్తింపు, గౌరవం కల్పిస్తే ఏం చేస్తున్నాము?
ఇది రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లేదా మరొకరు తప్పులు చేశారా లేదా? అని కాదు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలలో నానాటికీ అభిమానం పెరుగుతుంటే, ఇటువంటి పనులు లేదా వివాదాలలో చిక్కుకొని తమ పరువు తామే తీసుకోవడమే కాక పవన్ కళ్యాణ్ కూడా నలుగురిలో తలదించుకునేలా చేయడం సబబేనా?
మనల్ని చూసి పవన్ కళ్యాణ్ గర్వపడుతున్నారా లేక ప్రజల ముందు తల దించుకునేలా చేస్తున్నామా?అని జనసేనలో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం.
ఓ రాజకీయ పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకురావడం ఎంత కష్టమో జనసేన నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసు. అలాంటి గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ కల్పించినప్పుడు ఆయనకు, పార్టీకి, తమకూ కూడా ప్రజలలో మంచిపేరు సంపాదించుకోవాల్సిన బాధ్యత వారిదే కదా?
పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణులు గాడి తప్పకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. ఒక్కసారి ఏదైనా ముద్ర పడితే దానిని వదిలించుకోవడం చాలా చాలా కష్టం. ఆ ముద్ర పార్టీ భవిష్యత్‌ని తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…