
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచూ ‘న్యూస్ మేకర్’గా వార్తలలో నిలుస్తుండటం చాలా ఆలోచించాల్సిన విషయమే. ఓ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల గురించి, సాధిస్తున్న విజయాల గురించి వార్తలలోకెక్కితే అందరికీ చాలా సంతోషమే.
కానీ తిరుమల కల్తీ నెయ్యి, తిరుపతిలో తొక్కిసలాట వ్యవహారం, సనాతన ధర్మం, దీక్షలు, తమిళనాడు రాజకీయాలపై వ్యాఖ్యలు వంటి వాటితో వార్తలలో నిలుస్తున్నారు.
సోమవారం విశాఖపట్నంలో పర్యటించినప్పుడు, ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపి వేయడంతో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న నలుగురు విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో వారిని పోలీసులు లోనికి అనుమతించలేదనే వార్తలతో పవన్ కళ్యాణ్ మళ్ళీ మరోసారి మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు.
ఈ విషయం ఆయన దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించగా, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళుతున్నప్పుడు కూడా సర్వీసు రోడ్‌లో ట్రాఫిక్‌పై ఎటువంటి ఆంక్షలు విధించలేదని విశాఖ వెస్ట్ డివిజన్ ఏసీపీ పృధ్వీరాజ్ తెలిపారు. కనుక పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వలన ట్రాఫిక్ నిలిచిపోయి, విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగ చేరుకున్నారనే వార్తలను ఖండించారు. చిన ముషివాడలోని ఐయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రంలో మిగిలిన విద్యార్ధులందరూ సకాలంలో చేరుకోగలిగినప్పుడు, నలుగురు విద్యార్ధులు మాత్రమే ఎందుకు చేరుకోలేకపోయారని ప్రశ్నించారు.
ఈ వార్తలలో నిజానిజాలు, వాదోపవాదాలు పక్కన పెడితే, ప్రజాప్రతినిధులు తమ కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతే అది వారికి చాలా గొప్పగా అనిపించవచ్చు. అలా తాము దూసుకుపోతుంటే ప్రజలు అబ్బురపడతారని భావిస్తుండవచ్చు. కానీ ట్రాఫిక్ నిలిపివేస్తే ఇబ్బంది పడే సామాన్య ప్రజలు తమని తిట్టుకుంటారని గ్రహించలేరా?అనే సందేహం కలుగుతుంది.
జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ ర్యాలీల వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పేవారు. కనుక అధికారంలోకి వచ్చాక కూడా ఆవిదంగానే నిరాడంబరంగా వ్యవహరిస్తున్నారు. కానీ తెలిసో తెలియకో జరిగే కొన్ని పొరపాట్ల వలన లేదా ఇటువంటి వాటితో కూడా వైసీపీ, దాని మీడియా రాజకీయాలు చేస్తుందని, ఇటువంటి వార్తల వలన ప్రజలలో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుందని తెలిసి ఉన్నప్పుడు అధికార పార్టీలో అందరూ మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఈ కాన్వాయ్ సంస్కృతి వలన సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా.. అభిమానులకు తనపై చాలా భారీ అంచనాలున్నాయని, తన నుండి చాలా ఆశిస్తున్నారని పవన్ కళ్యాణ్ గ్రహించడం చాలా అవసరం.
The Kollywood film Mandaadi starring Soori and Suhas in lead roles and directed by Mathimaran…
Victory Venkatesh, Nandamuri Kalyanram are coming together for the first time in the direction of…