
జనసేనాని పవన్ కళ్యాణ్ తరచూ ఎదుర్కొనే విమర్శలలో రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించారని. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గత కొన్ని నెలలుగా పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించి చాలా శ్రమిస్తున్నారు. తమ అభిమాన హీరోతో రోజూ కలిసి పనిచేసే అవకాశం లభించడంతో జనసైనికులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఇదే సమయంలో ఆయనతో సినిమాలు మొదలుపెట్టిన దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన చివరి సినిమా ‘బ్రో’. అప్పటికే రాజకీయాలలో బిజీ అయిపోయిన కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలు పూర్తి చేయలేకపోయారు. అభిమానులు కూడా పవన్ సినిమాలను చాలా మిస్ అవుతున్నారు. కానీ పరిస్థితి వారికీ తెలుసు కనుక సర్దుకుబోతున్నారు.
ఇంత వరకు ఓకే. ఇక ముందు పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే ఇంకా గందరగోళంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలలో గెలవలేకపోతే యధా ప్రకారం సినిమాలు చేసుకొంటూ, అవసరమైతే జనసేనకు మరింత ఎక్కువ సమయం కేటాయించుకోవచ్చు.
కానీ సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక పవన్ కళ్యాణ్ కీలక పదవి, బాధ్యత చేపట్టవచ్చు. ఒకవేళ సినిమాల కోసం మంత్రి పదవి వద్దనుకున్నా, అధికారంలోకి వచ్చాక కూడా రాజకీయాలకు, ప్రజా ప్రతినిధిగా బాధ్యతలకు దూరంగా ఉంటే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఇదీగాక ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి మరింత చేరువయ్యే అవకాశం లభించినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా, బాధపడినా ప్రయోజనం ఉండదు. కనుక జనసేనను మరింత బలోపేతం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో యాక్టివ్‌గా ఉండక తప్పదు. కనుక జనసేన కోసం పవన్ కళ్యాణ్ సినిమాలు త్యాగం చేయక తప్పదు.
అయితే పవన్ కళ్యాణ్ పదేళ్ళు రాజకీయాలలో తిరిగినా సంపాదించలేని పేరు ప్రతిష్టలు, డబ్బు, ముఖ్యంగా అభిమానులను ఓకే ఒక్క హిట్ సినిమాతో సంపాదించుకోగలరు. ఆ సినిమా రాబడితోనే జనసేనను నడిపిస్తున్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. కనుక రాజకీయాల కోసం కల్పవృక్షం, కామధేనువు వంటి సినీ కెరీర్‌ని వదులుకోవడం పెద్ద తప్పే అవుతుంది.
అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించడం మానుకుంటే, రాజకీయంగా అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ చాలా చాలా శ్రమించాల్సి ఉంటుంది. కనుక సినిమాలలో నటించడం మానుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు.
అలాగని ఎప్పటిలాగే సినిమాలు, రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేయాలనుకుంటే, దేనికీ పూర్తి న్యాయం చేయలేక రెంటిలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
నందమూరి బాలకృష్ణ కూడా సినిమాలు, రాజకీయాలలో ఉన్నారు. కానీ ఆయన పవన్ కళ్యాణ్‌లాగా పార్టీకి అధ్యక్షుడు కారు. ఎమ్మెల్యే మాత్రమే. కనుక ఆయన సినిమాలు చేసుకొంటున్నా, ఆయన తరపున టిడిపి రాజకీయాలను చక్కబెడుతోంది. కానీ పవన్ కళ్యాణ్‌కు ఈ అవకాశం లేదు. కనుక ఎన్నికల ప్రక్రియ ముగిసేక పవన్ కళ్యాణ్ సినిమాలా లేదా రాజకీయాలా ఏదో ఒకటి ఎంచుకోక తప్పదు.
మే 13న పోలింగ్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల పనులతో బిజీగా ఉంటారు. కానీ మళ్ళీ జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కాస్త గ్యాప్ దొరుకుతుంది. కనుక ఆ గ్యాప్‌తో పాటు మరి కొంత సమయం తీసుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహరవీరమల్లు’ రెండు సినిమాలు పూర్తి చేసేయొచ్చు. కానీ ఆ తర్వాత ఎలా? అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవాలి.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…