
జనసేన పార్టీ ఎన్నికలలో గెలిచినప్పుడు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది.
ఆ తర్వాత డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ‘సీజ్ ది షిప్’ చేసినప్పుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మరోసారి వార్తలలో నిలిచారు.
ఇటీవల మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించి, విద్యుత్ సౌకర్యం కల్పించినప్పుడు మరోసారి వార్తలలో నిలిచారు. ఈవిధంగా వార్తలకు ఎక్కడం వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకీ, జనసేన పార్టీకి కూడా మంచిదే.
కానీ పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులను కొన్ని వివాదాలు మింగేస్తున్నాయి. శ్రీకాళహస్తికి చెందిన ఓ జనసేన నాయకుడు చెన్నైలోని ఓ హత్య కేసులో చిక్కుకోవడం, జనసేనకు చెందిన ఓ నేత చిన్న పిల్లల ముందు అమ్మాయితో కలిసి డాన్స్ చేయడం వంటివి జనసేన ప్రతిష్ట మసకబార్చుతాయి.
నేడు కొందరు జనసేన పార్టీ గొడుగులు పట్టుకొని తిరుమల కొండపై కనబడ్డారు. స్వామివారి సన్నిధిలో ఇతర పార్టీల నేతలకు రాజకీయాలు చేయవద్దని చెపుతున్నప్పుడు, అధికారంలో ఉన్న జనసేన నాయకులు ఈవిధంగా చేయడం సబబు కాదు కదా?
ఈ వివాదాలు చల్లారక మునుపే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, కోనసీమ-తెలంగాణ పేరుతో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సెగలు పుట్టిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సాధారణంగా పరుషంగా మాట్లాడరు. ఎవరినీ నొప్పించాలనుకోరు. తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాలా ఇష్టపడే పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశ్యంతో మాట్లాడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కనుక కోనసీమ-తెలంగాణ అంటూ ఆయన నోరు జారారో లేదా యధాలాపంగా మాట్లాడారో గానీ అవి వివాదంగా మారాయి. వీటి వలన రెండు ప్రభుత్వాల మద్య, ముఖ్యంగా ఆయన సినిమాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చు.
నేటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చీటికీ మాటికీ ఆంధ్రాని కించపరుస్తూనే ఉన్నారు కదా? కనుక మనమూ వారిని ఓ మాట అంటే తప్పేమిటి? అనిపించవచ్చు. కానీ వారు అనుచితంగా మాట్లాడినప్పుడు వెంటనే వారికి సూటిగా, ఘాటుగా జవాబు చెప్పడం తప్పు కాదు.
కానీ దాంతో వారు తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకుని రాజకీయ లబ్ది పొందుతుంటారు. వారికి ఆ అవకాశం ఇవ్వకూడదనే కూటమి ప్రభుత్వం స్పందించదు.
కానీ ఈ వివాదంతో మరో విషయం స్పష్టమైంది. ‘కేసీఆర్ మాట, మౌనం రెండూ సంచలనం’ అని కేటీఆర్ ఇటీవల గొప్పగా చెప్పుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు… పవన్ కళ్యాణ్ మాట, మౌనం కూడా అంతే సంచలనం సృష్టిస్తాయని స్పష్టమైంది.
ఏది ఏమైనప్పటికీ, ఇది అవసరం లేని సంచలనం కనుక పవన్ కళ్యాణ్ ఇంకా మౌనం వహించడం కంటే వెంటనే స్పందించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమే మంచిది.
The Cockroach Janta Party movement is stepping up its protests against the central government and…
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు…