
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ‘సనాతన ధర్మ పరిరక్షణ’ అంటుండంతో అభిమానులు అయోమయంగా చూస్తుంటే, రాజకీయ విశ్లేషకులు బీజేపీ వైపు అనుమానంగా చూస్తున్నారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఎవరూ ఈ సనాతనానికి కాస్త దూరంగానే ఉన్నట్లనిపిస్తోంది.
అయితే ఏపీలో ఉద్భవించిన ఈ సనాతన ధర్మ పరిరక్షకుడి ఆంతర్యం తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి బాగా అర్దమైంది. ఒకటి పవన్ కళ్యాణ్ తమిళంలో దానిని భోదించడం వల్ల కావచ్చు. రెండోది తమిళనాడులోని రెండు పార్టీలు సనాతన ధర్మానికి పూర్తి భిన్నమైన సిద్దాంతాలతో రాజకీయాలు చేస్తుండటం కారణం కావచ్చు.
ఇటీవలే తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్న ఉదయానిధి స్టాలిన్ కొన్ని రోజుల క్రితం “సనాతన ధర్మం ఓ వైరస్ వంటిది. దానిని అరికట్టకపోతే సర్వత్రా వ్యాపిస్తుందంటూ” తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశః దానికి కౌంటర్‌గానే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి తమిళ టీవీకి తమిళంలో వివరించి ఉండవచ్చు.
వారాహి డిక్లరేషన్లో కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ డీఎంకే ప్రస్తావన చేశారు. కనుక డీఎంకే ప్రతినిధి కూడా తాము సనాతన ధర్మానికి (అంటే హిందూ ఓటు బ్యాంకుకి) వ్యతిరేకం కాదని చెప్పారు. తాము కుల వివక్షని మాత్రమే వ్యతిరేకిస్తామని ఉదయానిధి స్టాలిన్ కూడా అదే చెప్పారని డీఎంకే ప్రతినిధి అన్నారు. అంటే సనాతన ఉద్దేశ్యాన్ని డీఎంకే బాగానే క్యాచ్ చేసిందన్నమాట!
దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులోనే అనేక పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు కూడా హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను చాలా నిష్టగా పాటిస్తుంటారు. దానికి తమిళ భాష ప్రేమ కూడా తోడవడంతో పవన్ కళ్యాణ్ చెపుతున్న సనాతన ధర్మం తమిళనాడులో చాలా బలంగా ఉంది.
అయినప్పటికీ సనాతన ధర్మాన్ని పట్టించుకోని డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే అధికారం చేజిక్కించుకోగలుగుతున్నాయి. హిందుత్వ అజెండాతో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి అక్కడ చోటు దొరకడం లేదు. అలాగే డీఎంకే, అన్నా డీఎంకేలు భావజాలానికి దగ్గరగా లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.
కనుక ఈ తమిళ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే సనాతన ధర్మ మార్గంలో పయనించడం ఒక్కటే మార్గమని బీజేపీ పెద్దలు భావించి, ముందుగా పవన్ కళ్యాణ్‌ని ఆ మార్గంలో నడిపిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చెపుతున్న ఈ సనాతన ధర్మంపై రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కానీ తమిళనాడులో పార్టీలు స్పందిస్తున్నాయి. అంటే తమిళనాడు రాజకీయాలపైకి బీజేపీ సందించిన సనాతన బాణం గురి తప్పలేదన్న మాట!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…