
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తునప్పుడు మళ్ళీ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారంటే రాజు గారు ఏడు చేపల కధ వంటి సంక్షేమ పధకాలు…అప్పుల కధ చెప్పుకోక తప్పదు.
రాష్ట్రానికి ఆదాయం లేకపోవడంతో సంక్షేమ పధకాల అమలుకు ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం అదనంగా మరో 2 శాతం వరకు అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తోంది.
ఆ 2 శాతం అప్పుల కోసమే జగనన్న ప్రభుత్వం మీటర్లు బిగించడానికి సిద్దపడింది. అంటే సంక్షేమ పధకాల కోసం అప్పులు తెచ్చుకొనేందుకు చివరికి రైతులపై కూడా కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోందన్న మాట!
కానీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని, ఎంత విద్యుత్ వాడుకొంటే అంతకీ రాష్ట్ర ప్రభుత్వమే సొమ్ము చెల్లిస్తుందని మంత్రిగారు తెలిపారు. దీని కోసం రైతులు బ్యాంక్ ఖాతాలు తెరవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే ఆ సొమ్మును రైతులు విద్యుత్ సరఫరా సంస్థలకు చెల్లించి విద్యుత్ పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎత్తేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజంకావని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
అయితే ప్రభుత్వమే నేరుగా ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి, అదే విద్యుత్‌కి ప్రభుత్వం రైతులకు నెలనెలా డబ్బులు చెల్లించడానికి ఎంత తేడా ఉంటుందో అందరికీ తెలుసు. ముందుగా రైతుకు ‘అర్హత’ పేరుతో కొంతమందిని వదిలించుకొంటుంది. తరువాత రైతులు బ్యాంక్ ఖాతాలు తెరవడం, వాటిని ఆధార్‌తో ముడిపెట్టడం, ఆ వివరాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదించడం మరో ప్రహసనం.
ఆ తరువాత నెలనెలా విద్యుత్ బిల్లులు తీయడం, వాటిని ప్రభుత్వం పరిశీలించడం, అర్హులైన రైతుల ఖాతాలలో ఆ డబ్బు జమా చేయడం మరో పెద్ద సస్పెన్స్ కధ. సకాలంలో డబ్బులు పడతాయో లేదో లేదో తెలీదు కనుక ప్రతీ నెల రైతులు వాటి కోసం బ్యాంకుల చుట్టూ తిరగక తప్పదు. సకాలంలో డబ్బు పడకపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కనుక అవసరమైతే రైతులు జేబులో నుంచి డబ్బు తీసైనా ముందు బిల్లు కట్టకతప్పదు.
అసలే డబ్బుకి కటకటలాడుతున్న ప్రభుత్వం, గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమ పధకాలకే కోతలు విధిస్తున్నప్పుడు వ్యవసాయ మోటార్ బిల్లుల చెల్లింపులకు కూడా ఏదో ఓ పేరు చెప్పి ఎంతో కొంత కోసుకొన్నా ఆశ్చర్యపడక్కరలేదు. కనుక ఆనాటి రాజుగారు ఏడు చేపల కధ ముగింపు ఉందేమో కానీ మన ఈ కధకి కామాలే తప్ప ముగింపు ఉండదు. కనుక రైతులూ…మీరూ కోతలకు రెడీ అయిపోండి!
Andhra Pradesh has just hit a major milestone, securing 2nd place in the National Panchayat…
Following the pan-India success of Kalki 2898 AD, Prabhas is now preparing for the much-awaited…