
సిట్ కార్యాలయంలో ఫైళ్ళు దగ్ధం… మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళు దగ్ధం… టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు దగ్ధం… ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ళు దగ్ధం… ఇలా రెండున్నర నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మదనపల్లిలో ఫైళ్ళు దగ్ధమైనప్పుడు డిజిపి ద్వారకా తిరుమల రావు స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించారు. తర్వాత ఏమైందో తెలీదు.
రాష్ట్రంలో కొన్ని వేల ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఇలా అగ్నిప్రమాదాలు జరుగడం లేదు. ఫైళ్ళు తగులబడటం లేదు. కానీ తరచూ ఏదో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మాత్రమే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి… ఫైళ్ళు దగ్ధం అవుతున్నాయి. కనుక అవన్నీ ప్రమాదవశాత్తూ జరిగాయని అనుకోలేము.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే మూడు నెలలు కావస్తున్నా, నేటికీ అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తున్నా, వైసీపికి వీర విధేయులుగా భావించిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినా…. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటే అర్దం ఏమిటి?
అసలు ఫైళ్ళు ఎవరు తగులబెడుతున్నారు?అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వంలో ఇంకా వైసీపి కోవర్టులు ఉన్నారని, వారే ఈ దుసాహసానికి పూనుకుంటున్నారని అనుమానించక తప్పదు. ఎందుకు తగులబెడుతున్నారు?అంటే గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై టిడిపి కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి, వైసీపి నేతలపై కేసులు నమోదు చేయిస్తోంది కనుక.
అవేవీ చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ వంటి భూటకపు కేసులు కావు. పక్కా సాక్ష్యాధారాలతోనే నమోదవుతున్నాయి. వాటిలో చిక్కుకుంటే రాజకీయాల మాట దేవుడెరుగు… జైల్లో చిప్ప కూడు తినాల్సివస్తుంది.
మహాశక్తివంతుడు, మహా మేధావి అనుకున్న తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ అంతటివాడు తన కూతురిని విడిపించుకోలేకపోతున్నారు. ఇక వైసీపి నేతలు ఏపాటి? బహుశః ఆ భయంతోనే ప్రభుత్వ కార్యాలయాలలో తమ కోవర్టుల ద్వారా తమ అవినీతికి సాక్ష్యాధారాలుగా ఉన్న ఫైల్స్ తగులబెట్టిస్తున్నట్లు అనుమానించక తప్పదు.
ఏదో ఒకసారి ఫైల్స్ తగులబడ్డాయంటే అగ్ని ప్రమాదమని సర్ధిచెప్పుకోవచ్చు. కానీ ఇలా తరచూ ప్రభుత్వ కార్యాలయాలలో ఫైల్స్ తగులబడుతుండటం మాత్రం ప్రమాదవశాత్తు అని అనుకోలేము.
ఇందుకు పలువురు వైసీపిని నిందిస్తుంటే, కొందరు టిడిపి మద్దతుదారులు తమ కూటమి ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. ప్రభుత్వం అసమర్దత, కటినంగా వ్యవహరించకపోవడం వలననే వైసీపి కోవర్టులు ఇలాంటి దుసాహసానికి పూనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
వారి వాదనలలో అసహనాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో అనేక చిన్నా పెద్దా, ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. వాటిలో ఎక్కడ ఎవరు ఏమి కుట్రలు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమే.
అయినా ఇప్పుడు ఈ ఫైల్స్ దగ్ధం అవడం నిత్యకృత్యం అయిపోయింది కనుక ఈ సమస్యకు తక్షణ పరిష్కారం ఆలోచించక తప్పదు.
ఎప్పటికప్పుడు విచారణ జరిపించి దోషుల పేర్లను బహిర్గతం చేయడమే కాక వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించి కేసులు నమోదు చేస్తుండాలి. ప్రతీ కార్యాలయం బాధ్యత సదరు జిల్లా కలెక్టర్‌కి అప్పగించాలి. ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు, దుశ్చర్యలలో ముఖ్యమైన రికార్డులను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేయించి క్లౌడ్ స్టోరేజీలో భద్రపరచాలి. ఈ సమస్య నివారించడానికి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…