
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిపక్షాల బెదిరింపులు చూస్తుంటే భవిష్యత్ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ట్రైలర్ చూస్తున్నట్లే ఉంది.
ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి, జయలలిత రాజకీయ ప్రత్యర్దులుగా ఉన్నప్పుడు ఈవిధంగా ప్రతీకార రాజకీయాలు జరుగుతుండేవి. వాటి గురించి మనం చెప్పుకొని ఆశ్చర్యపోతూ ఉండే వాళ్ళం. మన తెలుగు రాష్ట్రాలలో అలాంటి అవాంచిత ధోరణులు లేవని సంతోష పడుతుండేవాళ్ళం.
తమిళనాడు దివంగత సిఎం జయలలిత (అన్నాడీఎంకే) హయంలో పలు సంక్షేమ పధకాలు ప్రారంభించారు. వాటిలో కొన్నిటికి ఆమెను గుర్తుచేసే ‘అమ్మ’ పేరు పెట్టుకున్నారు.
ఆమె తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం నేటికీ ‘అమ్మ’ పేరుతో సహా చాలా వాటిని యధాతధంగా కొనసాగిస్తోంది.
మన రాజకీయ పార్టీలు కాస్త ఆలస్యంగా ఆ ప్రతీకార రాజకీయాలను అందిపుచ్చుకున్నాయి. కానీ ‘లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానన్నట్లు’ ఇప్పుడు తమిళనాడు కంటే చాలా దూరం వెళ్ళిపోయాము.
బోర్డులు, ఊర్లు, పేర్లు, రంగులు మార్చడంతో ఎవరూ ఆగడం లేదు. తమ పగ, ప్రతీకారాలతో సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే అన్నా క్యాంటీన్లు, నిరుపేద చేనేత కార్మికులను, మహిళలను ఆదుకునే బతుకమ్మ చీరల పధకాలను నిలిపివేస్తున్నారు.
రాజకీయ అసూయ ద్వేషాలతో లక్షల కోట్లు విలువగల అమరావతి, కాళేశ్వరం వంటివి పాడు బెట్టేసుకుంటున్నారు. ప్రభుత్వం మారితే ఇలా అన్నీ మారిపోతుంటాయి.
అధికారంలోకి వచ్చినవారు ఈవిధంగా వ్యవహరిస్తుంటే, ప్రతిపక్షాలు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మేము అధికారంలోకి రాగానే ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతామని’ ఒక పార్టీ బెదిరిస్తుంటే, ‘ఒక్కొక్కరి తోలు వలిచేస్తామని’ మరొక పార్టీ నేతలు బెదిరిస్తున్నారు.
ఈ రాజకీయ కక్షలు, ప్రతీకారాలు ఆ పార్టీలకే పరిమితమైతే ఎవరూ పెద్దగా పట్టించుకొని ఉండేవారు కారు. కానీ పోలీస్ కానిస్టేబుల్ మొదలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరకు, పార్టీ కార్యకర్తలు మొదలు మీడియా వరకు ప్రతీ ఒక్కరిపై ప్రతీకార చర్యలు తప్పవని ప్రతిపక్షాలు ‘బహిరంగంగానే’ బెదిరిస్తున్నాయి.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈవిధంగా అందరినీ భయపెడుతుంటే ఇక అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి?’అని అధికారులు భయపడకుండా ఉంటారా? మరి వారు సమర్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎలా పని చేయగలరు?
రాష్ట్రాలలో ఇలాంటి ప్రమాదకరమైన రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్త పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వస్తాడు?పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు మాత్రం ముందుకు వస్తారు?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిపక్షాల బెదిరింపుల నేపధ్యంలో కాంగ్రెస్, కూటమి ప్రభుత్వాలు రెండూ పులి మీద సవారీ చేస్తున్నట్లే అనిపిస్తుంది.
అందుకే ప్రభుత్వం మారితే? అనే ఓ చిన్న ప్రశ్న ఇప్పుడు పదేపదే వినిపిస్తోంది. అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ రాజకీయకక్షలు, ప్రతీకార రాజకీయాలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు యూపీ, బిహార్ రాష్ట్రాల్లా మారిపోకుండా కాపాడుకోగలమా?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…