
జగన్ తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడ అనాలో లేక వ్యూహాత్మక తప్పిదనం అనాలో కానీ చంద్రబాబుని అరెస్టు చేయాలి అనే నిర్ణయం ఒక రకంగా చూస్తే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇది ఒక మాయని మచ్చగా భావించాలి మరో రకంగా ఆలోచిస్తే చంద్రబాబు స్టామినా ఎంటో ఆయన ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు ఎంటో ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి జ్ఞప్తికి తెచ్చారు.
ప్రత్యర్థి పార్టీలు సైతం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడాల్సిన పరిస్థితులు తీసుకువచ్చారు.ఇదంతా కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పుణ్యమే అనకతప్పదు. 2018 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన అప్పటి అధికార తెరాస పార్టీ అధిష్టానం ప్రస్తుతం బాబు భజన చేస్తుందనే చెప్పాలి. బాబు అరెస్టుతో హైద్రాబాద్ లో వెల్లువెత్తిన నిరసనలకు కంగుతిన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిరసనలను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యిందనే చెప్పాలి.
చేసిన తప్పేంటో ఇట్టే గ్రహించిన కేటీఆర్ తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారంటూ, తనకు లోకేష్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయంటూ, చంద్రబాబు జైలుకు వెళ్లడం తనకు బాధను కలిగించిందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని కోరుకుంటున్నానంటూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అలాగే తమ పార్టీ ముఖ్య నేతలైన హరీష్ రావు, తలసాని మరికొందరు కూడా చంద్రబాబు అరెస్టుని ఖండిస్తున్నట్టు ప్రకటనలు జారీ చేశారు.
అధికార బిఆర్ఎస్ నేతలు బాబు పట్ల తమ పార్టీ వైఖరిని అలా ప్రజలకు సంజాయిషీలు ఇస్తూ చంద్రబాబు పట్ల ప్రజలలో వచ్చిన సానుభూతిని తమ పార్టీ ఓటుబ్యాంకుగా మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ బాబుకి తమ మద్దతు తెలియచేసారు. వారిలో ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల, కిషన్ రెడ్డి వంటి ముఖ్య నేతలు బహిరంగంగానే జగన్ అలా చేసుండకూడదు అంటూ బాబుకి మద్దతుగా నిలబడ్డారు.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే టి.కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పటి చంద్రబాబు శిష్యుడే కావడంతో ఆయన చంద్రబాబు పై తనకున్న గౌరవం ఎప్పటికి తగ్గేది కాదని బాబు అటువంటి అవినీతి చర్యలకు పాల్పడడని బాబుకి ఒత్తాసుపలికారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో ముఖ్య నేత అయిన తుమ్మల కూడా నా రాజకీయ గురువు చంద్రబాబే అని ఖమ్మంలో తనను గెలిపిస్తే చంద్రబాబుని గెలిపించినట్టేనని తన ఎన్నిక ప్రచారంలో స్థానిక ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
ఇక జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాలలో కూడా ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి టీడీపీ మద్దతుదారులు ఓటేసి చంద్రబాబుకి తమ మద్దతు తెలియచేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన బిఆర్ఎస్ నేతలు మొదలు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీ నేతలు చంద్రబాబు నామస్మరణతో ఎన్నికలలో విజయాన్ని అందిపుచ్చుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.
ఇక ఇదంతా పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయం వలన అటు ప్రజలలో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో “హీరో అయ్యింది ఎవరో జీరో అయ్యింది ఎవరో” తెలుసుకుని మీడియా మైకుల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో తానూ ఆశించిన పార్టీకి కాకుండా మరో పార్టీకి అధికార పగ్గాలు దక్కితే ఇక ఆ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించడానికి నేతలెవరూ ముందుకు రాలేని పరిస్థితి వైసీపీ లో నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…