తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆ తరువాతి కాలంలో కేసీఆర్ తో చేతులు కలపలేదు. కేసీఆర్ ఆయన ఒక పదవి ఇచ్చినా ఆయన తిరస్కరించారట. తరువాతి కాలంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి తన వల్ల రాజకీయంగా లాభ పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి నేతల చేత తిట్టించుకున్నారు కూడా.
ఎన్నికలకు ముందు తెలంగాణ జనసమితి అనే పార్టీని స్థాపించి గత ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. పోటీ చేసిన స్థానాలలో ఒక్క చోట కూడా డిపాజిట్ సాధించలేకపోయి అభాసుపాలు అయ్యారు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరోసారి కోదండరామ్ క్రియాశీలకంగా మారబోతున్నారు.
ఆర్టీసీ కార్మిక జేఏసీ ఛైర్మన్ అశ్వద్దరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరో సకల జనుల సమ్మె చేయాలని, దానికి కోదండరామ్ నాయకత్వం వహించాలని అన్నారు. దానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తూ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండడానికి మరో ఉద్యమం అవసరం అని అన్నారు.
కాగా కోదండరామ్ కార్మిక నేతలతో కలిసి ఆయా పార్టీల ప్రముఖులను కూడా కలుస్తున్నారు. దీంతో కోదండరామ్ ఆద్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన ఆ పని చేసి ఉద్యమం సక్సెస్ అయితే మరోసారి ఆయన తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలకం అవుతారు.





