
ఒక్కోసారి చెడు పరిణామాల నుంచి కూడా మంచి జరుగుతుందంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ చిన్నారి పునర్విక కథ తదనంతర పరిణామాలు వింటే నిజమే అనిపిస్తుంది.
కర్నూలుకి చెందిన చిన్నారి పునర్విక చాలా అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే వ్యాధి బారినపడి మృత్యువుతో పోరాడుతోంది. ఆ చిన్నారి ప్రాణం కాపాడాలంటే రూ.16 కోట్లు ఖరీదైన జెలో జెన్ స్మా అనే ఇంజక్షన్ చేయాల్సిందే.
అది మన దేశంలో ఎక్కడా తయారవదు. దొరకదు. విదేశాల నుంచి రప్పించుకోవాల్సిందే. పాప తల్లితండ్రులు ఇక ఆశ వదిలేసుకున్నారు.
కానీ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తూ దాతలు సుమారు రూ.6 కోట్లు ఆర్ధిక సాయం అందించారు. అయినా మరో పది కోట్లు అవసరం. అది సమకూర్చుకోవడం ఇంకా కష్టం. ఈ వార్త మంత్రి నారా లోకేష్ చెవిన పడటం ఆ పాప పునర్విక, ఆమె తల్లితండ్రుల అదృష్టమనే చెప్పాలి.
మిగిలిన పది కోట్లు మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుంచి రూ.16 కోట్లు ఖరీదైన జెలో జెన్ స్మా ఇంజక్షన్ రప్పించారు. ఆయన సమక్షంలోనే హైదరాబాద్‌లోని రెయిన్ బో హాస్పిటల్లో వైద్యులు పునర్వికకు ఆ ఇంజక్షన్ చేసి ప్రాణాలు కాపాడారు.
మంత్రి నారా లోకేష్ పునర్వికని ఎత్తుకొని ముద్దాడిన తర్వాత అప్పటికప్పుడు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. “ఇప్పటికి అందరం కలిసి పునర్వికని కాపాడుకోగలిగాము. కానీ రాష్ట్రంలో ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఎందరున్నారో… వారు వారి తల్లితండ్రులు ఎంత బాధపడుతున్నారో ఎవరికీ తెలియదు.
కనుక అటువంటి వారి కోసం ఈ పాప స్పూర్తితో ‘ప్రాజెక్ట్ పునర్విక’ చేపట్టాలని నిర్ణయించాను. రాష్ట్రంలో అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను గుర్తించడం, వారికి అవసరమైన చికిత్స అందించడం, దాని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు సమకూర్చడం దీనిలో భాగం.
ఇలాంటి వ్యాధులకు మందులు తయారుచేస్తున్న జాతీయ అంతర్జాతీయ ఔషద కంపెనీలను గుర్తించడం, అరుదైన ఈ వ్యాధులకు అయ్యే చికిత్స ఖర్చుల తగ్గించేందుకు, మందులు సేకరించేందుకుగాను వాటితో సంప్రదింపులు జరిపేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాము,” అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ‘ప్రాజెక్ట్ పునర్విక’లో వైద్య నిపుణులు, సంబధిత రంగాల మేధావులు, ప్రభుత్వాధికారులు ఉంటారని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
మొన్నటి వరకు చిన్నారి పునర్విక జీవన్మరణ పోరాటం చేసింది. కానీ ఇప్పుడీ గొప్ప ప్రాజెక్టుకు ఆ చిన్నారే స్పూర్తిగా నిలవడం చాలా సంతోషకరమైన విషయం
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…
Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…