
YS Jagan Faces Political Challenge in Pulivendula
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో అనేదానికి చ్ఛకటి ఉదాహరణగా నిలిచింది వైసీపీ. నాడు చేతిలో ఉన్న అధికార బలంతో తనది కానీ యుద్ధం చేసి తనకు రాజకీయ బలం లేని కుప్పంలో వైసీపీ జెండా ఎగరేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో బాబు కంచుకోటగా చెప్పబడే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయడానికి వైసీపీ శ్రేణులు పడిన ఆరాటం టీడీపీ శ్రేణులలో ‘వై నాట్ పులివెందుల’ అనే రాజకీయ కసిని పెంచింది.
ఫలితంగా కూటమి అధికారంలోకి రావడం, టీడీపీ అధినేత బాబు ముఖ్యమంత్రి కావడం, కూటమి హయాంలో స్థానిక ఎన్నికల సమరం మోగడం, టీడీపీ నాటి పాత లెక్కల సర్దుబాటు తెరమీదకొచ్చింది. పర్యవసానంగా నాడు కుప్పం కోసం వైసీపీ పడిన ‘ఆరాటం’ కాస్త నేడు పులివెందుల ‘పోరాటం’గా మారింది.
నాడు కుప్పం లో టీడీపీ కోసం నిలబడిన పసుపు తమ్ముళ్లను రోడ్ల మీదకు లాగిన వైసీపీ టీడీపీ పై రాజకీయంగా పై చేయి సాధించగలిగింది. అయితే దాని తాలూకా ఫలితం నేడు పులివెందులలో వైసీపీ పరువు కోసం జగన్ రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది.
పులివెందులలో వైసీపీ ఓటమి అంటే అది జగన్ కు ముఖ్యంగా వైఎస్ బ్రాండ్ కి పెద్ద అవమానమే అవుతుంది. ఇప్పటికే 2025లో జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికలలో వైసీపీ ఆ అవమాన భారాన్ని మోస్తుంది. ఈ స్థానిక ఎన్నికలలో కూడా అదే ఫలితాలు రిపీట్ అయితే అది వైసీపీ కి ముఖ్యంగా జగన్ అండ్ ఫ్యామిలీకి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బే అవుతుంది.
అయితే పులివెందుల వైసీపీ గెలుపు కోసం చొక్కాలు మడతపెట్టండి అంటూ తనవారికి పిలిపించిన జగన్ చివరికి పులివెందులలో ఓటు కూడా వెయ్యకుండా వెనుతిరగడం, యుద్ధం చేసినట్టా.? వెన్ను చూపినట్టా.? ఈవీఎం లు వద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటూ నినాదాలు చేసిన వైసీపీ ఇప్పుడు ఈ తరహా ఎన్నికలకు కూడా అప్పుడే ఓటమికి సాకులు వెతికే పనిలో పడిందా.?
అందులో భాగంగా పులివెందులలో టీడీపీ తన పంతం నెగ్గించుకోవడానికి, వైసీపీ ని ఓడించడానికి అరాచకంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య దాడులకు పాల్పడుతుందంటూ పులివెందుల రోడ్డు మీద నిరసన చేపట్టారు వైఎస్ జగన్.
అలాగే పులివెందులలో రీ పోలింగ్ కోసం డిమాండ్ చేస్తూ తన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా జగన్ వెనుతిరగడం వైసీపీ ఓటమిని పరోక్షంగా అంగీకరించనట్టేనా.? అన్న చర్చ నడుస్తుంది. అయితే నాడు కుప్పంలో గెలిచి టీడీపీ ఆత్మస్తైర్యం మీద దెబ్బ కొట్టిన వైసీపీ కి పులివెందులలో టీడీపీ జెండా ను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలన్నది టీడీపీ మద్దతుదారుల రాజకీయ ఆకాంక్ష గా మారిపోయింది.
పులివెందులలో నేడు వైసీపీ ఎదుర్కుంటున్న ప్రస్తుత పరిస్థితులకు నాటి కుప్పంలో వైసీపీ వేసిన రాజకీయ బీజాలే కారణంగా మారాయా.? నాటి కుప్పం వైసీపీ ఆరాటానికి నేటి పులివెందుల వైసీపీ పోరాటం తో లెక్క సరైనట్టేనా.?
Telugu cinema has developed a habit of racing against time, especially when it comes to…
Unconfirmed speculation that the makers of Theeran Adhigaaram Ondru are planning a sequel and that…