
గత పదేళ్ళుగా అక్రమాస్తుల కేసుల సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణ ముందుకు సాగనీయకుండా చేస్తున్నారు. కనుక ఈ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైసీపి ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, ఈ కేసుల విచారణ ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందో వివరణ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉందో లేదో కూడా చెప్పాలని సీబీఐని ఆదేశించింది.
ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొనబడిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి, ఇంకా ఈ కేసులతో సంబంధం ఉన్న పలువురిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు విచారణ 5 ఏళ్ళుగా సాగుతోంది. ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఇదే విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, 2024 జూలై నెలాఖరులోగా విచారణ ముగించాలని గడువు విధించింది. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్పించింది. కేసు విచారణను హైదరాబాద్‌కు మార్చింది. కానీ నేటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.
కోడికత్తి కేసు కూడా కూడా విశాఖకు బదిలీ అయ్యింది. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కోర్టు తేల్చి చెప్పినా 5 ఏళ్ళుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. నిందితుడు శ్రీనివాస్ (దళిత యువకుడు) ‘రిమాండ్ ఖైదీ’గా 5ఏళ్ళుగా జైలులోనే మగ్గుతున్నాడు.
కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. ఆ కేసు విచారణ కూడా నింపాదిగా సాగుతూనే ఉంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ దాదాపు రెండేళ్ళుగా కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులన్నీ అంతూ పొంతూ లేకుండా ఎందుకు సాగుతున్నాయో సుప్రీంకోర్టుకి తెలియదనుకోలేము. అలాగే ఈ కేసులన్నిటిలో డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి ఉన్నవారందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పేదరికం కారణంగా నిందితులు, బాధితులకు న్యాయం జరగడం లేదని కూడా తెలుస్తూనే ఉంది.
కనుక రఘురామ వేసిన ఈ కొత్త పిటిషన్, దానిపై విచారణ కూడా ఇదే విదంగా సాగవచ్చు. ఈ కేసు తదుపరి విచారణ జనవరికి వాయిదా వేయడంతోనే ఈ కేసుకి కూడా అప్పుడే మూడు నెలల వయసు వచ్చేసింది కదా?అది కూడా మరో మూడేళ్ళు సాగితే ఆశ్చర్యం ఏముంటుంది?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…