
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకానొక సమయంలో రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్ధపడ్డారు. కానీ వయసు, ఆరోగ్యం వంటి వివిధ కారణాల వలన ఆ ఆలోచన విరమించుకొని చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు. సినిమాలలో మళ్ళీ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
ఎవరూ వేలెత్తి చూపలేని అలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్ కూడా ఒకే ఒక్క కారణం వలన విమర్శల పాలయ్యారు.
తమిళనాడు ఎన్నికలలో మాజీ సిఎం స్టాలిన్… ఆయన నేతృత్వంలోని డీఎంకే ఓడిపోయినప్పుడు రజనీకాంత్ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడమే ఇందుకు కారణం.
అదే సమయంలో టీవీకే పార్టీ 108 సీట్లు వచ్చి మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోలేకపోవడంతో ఆ పార్టీ అధినేత విజయ్ మద్దతు కోసం ఆపసోపాలు పడుతున్నారు.
అలాంటి సమయంలో రజనీకాంత్ స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలవడంతో విజయ్ సిఎం కాకుండా అడ్డుకునేందుకే స్టాలిన్‌ని కలిశారని ట్రోలింగ్ మొదలైపోయింది.
అదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయంటూ వచ్చిన ఊహాగానాలు కూడా వచ్చాయి.
కనుక తమిళనాడు సిఎం అవుదామనుకున్న రజనీకాంత్ కాలేక విజయ్ మీద అసూయతో స్టాలిన్ సాయంతో అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ విమర్శలు వచ్చాయి.
అందుకే ఆయన “విజయ్ సిఎం కావడంపై మీ అభిప్రాయం ఏమిటి?” అని చెన్నై విమానాశ్రయంలో విలేఖరులు అడిగినప్పుడు చిర్నవ్వు నవ్వేసి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారనే లాజిక్ పాయింట్ మరొకరు తీశారు. కనుక అందరూ కలిసి రజనీకాంత్‌ని దోషిగా నిలబెట్టారన్న మాట.
కనుక రజనీకాంత్ నేడు చెన్నైలోని తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టి వాటిని ఖండించాల్సి వచ్చింది. ఆయన ఏమన్నారంటే, “విజయ్ నా కంటే 25 ఏళ్ళు చిన్నవాడు. అతను నాకు సమ ఉజ్జీ కాదు. నా సమ ఉజ్జీ కమల్ హాసన్. ఒకవేళ కమల్ సిఎం అయ్యుంటే అసూయ పడేవాడినేమో కానీ విజయ్‌ని చూసి అసూయపడాల్సిన అవసరమే నాకు లేదు.
అయినా నేను రాజకీయాలలోకి ప్రవేశించకూడదని నిర్ణయించుకున్నాక వాటికి దూరంగా ఉంటున్నాను. స్టాలిన్‌తో నా స్నేహం ఇప్పటిది కాదు. మాది రాజకీయాలకు అతీతమైన స్నేహం. కనుక నా స్నేహితుడు ఎన్నికలలో ఓడిపోయారని బాధపడి ఆయనని పరామర్శించడానికే వెళ్లాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.
విజయ్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఫోన్ చేసి అభినందించాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. అవసరం లేదు కూడా.
సరికొత్త ఆలోచనలతో విజయ్ సిఎంగా బాధ్యతలు చేపట్టాడు. కనుక అతను తప్పకుండా రాష్ట్రానికి మేలు చేసి అభివృద్ధి పధంలో నడిపిస్తాడని గట్టిగా నమ్ముతున్నాను,” అని రజనీకాంత్ అన్నారు.
Renowned Indian cinematographer R.Rathnavelu recently sat down with M9 News to discuss his latest…
పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రెండు వారాలు చర్లపల్లి జైలుకి వెళ్ళాల్సిరావడం అతని తండ్రి…