సూపర్ స్టార్ రజినీ కాంత్ కు సరైన హిట్ పడక చాలా కాలం అవుతోంది. చివరిసారి రజినీ కాంత్ 2021 లో అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చింది. ఈ సినిమా కంటే ముందు కూడా రజీనీని వరుస ఫ్లాపులే వెక్కిరించాయి. అయితే తాజాగా విడుదలైన జైలర్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ రజినీ ఖాతాలో మరో మంచి సినిమా అని చెప్పొచ్చు. జైలర్ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉండగా సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. రజినీ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. రజినీ కాంత్ అంటే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ఆయన స్టైల్, మ్యానరిజమే.
కానీ జైలర్ అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమాలో రజినికి కబాలి..కాలా సినిమా మాదిరిగా ఎలాంటి ఎలివేషన్ లు ఇవ్వలేదు. రజినీ బయట ఎలా కనిపిస్తారో అలానే చూపించాడు దర్శకుడు నెల్సన్. సినిమాలో రజినీ కాంత్ పెద్దాయన పాత్రలో కనిపించాడు. గత సినిమాల్లో రజినీ కాంత్ భీబత్సమైన ఫైట్ లు చేసేవాడు.
కానీ జైలర్ లో యాక్షన్ సీన్ లు ఉన్నప్పటికీ అవి రజినీ కాంత్ ఎగిరెగిరి కొట్టే లా కాకుండా రజినీ స్వాగ్ ను తగ్గకుండా చూపించారు. సీనియర్ హీరోలు కుర్ర హీరోలు చేసే పాత్రల్లో కూడా నటిస్తున్నారు. అయితే అలా చేసినప్పుడు హిట్ ల కంటే ఫ్లాప్ లే ఎక్కువ పడుతున్నాయి. రజినీ అది గ్రహించాడో ఏమో కానీ రియాలిటీకి వచ్చాడు. ఈ సినిమా చూసిన తరవాత ప్రేక్షకులు రజినీకాంత్ ఇలాంటి పాత్రల్లోనే నటించడం బెటర్ అనుకుంటున్నారు.



